సాధారణంగా పదవీ విరమణ పొందిన ఒక ఐఏఎస్ అధికారి కాలధర్మం చెందినప్పుడు ఆయన సన్నిహితులు తప్ప బయటివారు అంతగా పట్టించుకోవడమన్నది అరుదు. కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ అస్తమయం (1.6.2021) అసాధారణంగా ప్రముఖ వార్త అయింది. దానికి కారణాలు అనేకం. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను దాదాపు రెండు దశాబ్దాలపాటు ప్రభావితం చేసిన సమున్నత అధికారి ఆయన. పదవిలో ఉన్నప్పుడు తన విజయాల గురించి ఎస్వీ ఎన్నడూ చాటుకోకపోవడం ఆయన వినమ్రతకు తార్కాణం. పదవీ విరమణ చేశాక కూడా తన విజయాల గురించి చెప్పుకోకపోవడం ఆయన విశిష్ట వ్యక్తిత్వానికి నిదర్శనం.
తిరుగులేని సామర్థ్యం...
ప్రధాన కార్యదర్శి లేదా చీఫ్ సెక్రటరీ(సీఎస్) అనేది రాష్ట్రంలో అత్యున్నత సివిల్ సర్వీసు పదవి. ప్రతి యువ ఐఏఎస్ అధికారి లక్ష్యం, స్వప్నం దాన్ని అందుకోవడమే. ఎస్వీ ప్రసాద్ ఈ లక్ష్యాన్ని 2010లో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందుకున్నారు. చీఫ్ సెక్రటరీ పదవిలో అత్యంత సీనియర్ అధికారిని నియమించాలనే రివాజు ఏదీ లేదు. అంతకన్నా జూనియర్‌లైన అధికారుల నుంచి తమకు ఇష్టమైనవారిని చీఫ్ సెక్రటరీగా ఎంపిక చేయడం ముఖ్యమంత్రులకు ఆనవాయితీ. ఇది నచ్చక చాలామంది సీనియర్లు నొచ్చుకుంటారు. తెరచాటు విమర్శలు, వ్యాఖ్యానాలు చేస్తుంటారు.
కానీ... 20 మంది సీనియర్లను కాదని ఎస్వీ ప్రసాద్‌ను చీఫ్ సెక్రటరీగా నియమించినప్పుడు విమర్శలు, వదంతులు రాలేదంటే కారణం- తిరుగులేని సామర్థ్యం, వృత్తినైపుణ్యం, నిజాయతీ, నాయకత్వ పటిమలే. చీఫ్ సెక్రటరీ పదవికి వన్నె తెచ్చారాయన. ముఖ్యమంత్రికి ప్రధాన కార్యదర్శిగా రాణించాలంటే సామర్థ్యానికి తోడు రాజకీయాల తీరూతెన్నులూ తెలిసి ఉండాలి. అవసరమైనప్పుడు ముఖ్యమంత్రికి గుట్టుగానైనా నిజాన్ని నిర్మొహమాటంగా చెప్పగలిగి ఉండాలి. తెరచాటునే ఉంటూ ముఖ్యమంత్రికి ఉన్నతాధికారులకు మధ్య వారధిలా వ్యవహరించాలి. ఎస్వీ ప్రసాద్ ఈ పనులన్నీ లాఘవంగా చేసేవారు. అసలు ఒక ముఖ్యమంత్రికి ముఖ్య కార్యదర్శిగా (ప్రిన్సిపల్ సెక్రటరీగా) పనిచేయడమే గొప్ప అనుకుంటే, ఎస్వీ ఏకంగా ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద ఆ పదవి నిర్వహించడం అసామాన్యం, అపూర్వం.
సాధారణంగా వ్యక్తిగత, రాజకీయ కారణాల వల్ల ఒక సీఎం తనకన్నా ముందు ముఖ్యమంత్రి వద్ద పనిచేసిన అధికారిని అదే పదవిలో నియమించరు. కానీ, ఎన్.జనార్దన్‌రెడ్డి, కె.విజయ భాస్కరరెడ్డి, చంద్రబాబు నాయుడులు ఎస్వీ ప్రసాద్‌ను ప్రిన్సిపల్ సెక్రటరీ పదవిలో కొనసాగించడం ఆయన సామర్థ్యానికి విశిష్ట ప్రతీక. కత్తిమీద సాము చేసే నైపుణ్యం ఆయన సొంతం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో- అంటే 1990లలో నేను రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి పదవి నిర్వహించేవాణ్ని. అప్పట్లో మాకు నిత్యం నిధుల కటకటే. రిజర్వు బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని రద్దు చేస్తుందేమోనని దినదిన గండంగా గడిపేవాళ్లం. సమస్యను ముఖ్యమంత్రికి నివేదించే అవకాశం కోసం ఎప్పుడూ నిరీక్షణే.