suspension: ఏపీలో ఐదుగురు తెలుగుదేశం ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. సభ ప్రారంభమైన వెంటనే జంగారెడ్డిగూడెం నాటుసారా మరణాలపై చర్చించాలని తెదేపా సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. తీర్మానంపై చర్చకు పట్టుబట్టారు. తిరస్కరించిన స్పీకర్.. తెదేపా ఎమ్మెల్యేల ఆందోళనతో సభను రెండుసార్లు వాయిదా వేశారు.
ఈ క్రమంలోనే తెదేపా శాసన సభ్యులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, డోలా బాల వీరాంజనేయ స్వామిని... బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేయాలని ఆర్థిక మంత్రి బుగ్గన తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ వెంటనే ఐదుగురు సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లాలని స్పీకర్ కోరారు.
తమ గొంతునొక్కేస్తున్నారంటూ తెదేపా ఎమ్మెల్యేలు బిగ్గరగా నినాదాలు చేయడంతో స్పీకర్ మార్షల్స్‌ను రప్పించారు. పయ్యావుల కేశవ్‌ను మార్షల్స్ ఎత్తుకుని సభ బయటకు తీసుకెళ్లారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అలానే చేయబోగా.. ఆయన మార్షల్స్‌పై ఆగ్రహం వ్యక్తంచేసి బయటకు వెళ్లిపోయారు. తర్వాత మిగతా ముగ్గరు సభ నుంచి బయటకు వెళ్లారు.
సారా మరణాలపై చర్చకు భయపడే ప్రభుత్వం తమను సస్పెండ్ చేసిందని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. జగన్ రెడ్డి చేస్తున్న అక్రమ మద్యం వ్యాపారం బయటపడుతుందనే... చర్చకు అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. ఏటా రూ.4వేల కోట్ల అక్రమ మద్యం ముడుపులు జగన్ రెడ్డికి వెళ్తున్నాయని తెదేపా నేతలు ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి:కొనఊపిరితో చిన్నారి.. పనిచేయని ఆక్సిజన్ యంత్రం.. డాక్టర్ ఐడియాతో...