Monsoon in Kerala: నైరుతి రుతుపవనాలు ఈసారి ముందే పలకరించాయి. సాధారణంగా జూన్ ఒకటిన కేరళలో ప్రవేశించే 'నైరుతి' మూడు రోజుల ముందుగానే వచ్చేసిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఆదివారం కేరళను తాకిన రుతుపవనాలు అక్కడ స్థిరంగా ఉన్నట్లు వాతావరణ విభాగ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను కారణంగా గత నెల నుంచి రుతు పవనాల్లో వేగం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే దేశంలోకి త్వరగా ప్రవేశించాయని స్పష్టం చేశారు.
రానున్న మూడు, నాలుగు రోజుల్లో కేరళలోని మిగిలిన ప్రాంతాలు, తమిళనాడు, కర్ణాటకలో మరింత ముందుకు కదులుతాయి. అక్కడి నుంచి ఈశాన్య ప్రాంతంవైపు నెమ్మదిగా పురోగమించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. బంగాళాఖాతంలోని పరిస్థితుల వల్ల అండమాన్ నికోబార్ దీవుల్లో నెమ్మదించాయి. రుతుపవనాల ప్రభావంతో శనివారం కేరళలో పలు ప్రాంతాల్లో 2.5 మి.మీ వర్షపాతం నమోదైంది.