Telangana Weather Updates : నైరుతి రుతుపవనాలు సోమవారం(ఈ నెల 13)కల్లా తెలంగాణ, ఏపీలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం నాటికి గోవా, కొంకణ్, కర్ణాటక ప్రాంతాల్లో కొంతమేర విస్తరించాయని పేర్కొంది. పశ్చిమ భారత తీర ప్రాంతాలన్నింటా రుతుపవనాలు విస్తరించడంతో ఆది, సోమవారాల్లో తెలంగాణ, ఏపీల్లోకి ప్రవేశిస్తాయని అంచనా. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
Telangana Weather Updates : రేపు తెలుగు రాష్ట్రాలకు నైరుతి రాక.. - తెలంగాణలో వర్షాలు 2022
Telangana Weather Updates : నైరుతి రుతుపవనాలు రేపు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆది, సోమ వారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇన్నాళ్లూ ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు.. ఇక నుంచి సేద తీరనున్నారు.
శనివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా బేలలో 4, తలమడుగులో 3.5, పిప్పల్‌ధరిలో 3.3, వడ్యాల(నిర్మల్)లో 2.9, మేనూరు(కామారెడ్డి)లో 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలతో వడగాలులు వీస్తున్నాయని తెలిపింది. శనివారం రాష్ట్రంలో అత్యధికంగా గోధూరు(జగిత్యాల జిల్లా)లో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం ధనోర గ్రామంలో శనివారం పిడుగుపాటుకు గోస్కుల ఆశన్న(55) అనే రైతు తన భార్య కళ్లముందే మృతి చెందాడు.
శనివారం ఉదయం నుంచి హైదరాబాద్‌లో ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ఊపిరి పీల్చుకున్నారు. రుతుపవనాలు సమీపిస్తున్న తరుణంలో వాతావరణంలో మార్పులు జరిగి ఆకాశం మేఘాలతో అలరించగా.. మేడ్చల్ జిల్లా బహదూర్‌పల్లి వద్ద కెమెరాకు చిక్కిన చిత్రమిది.