తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎంఎంటీఎస్​ రెండో దశ పనులు వేగవంతం - south central railway mmts second line works

హైదరాబాద్​లో ఎంఎంటీఎస్​ రైళ్ల రెండో దశ పనులను దక్షిణ మధ్య రైల్వే వేగవంతం చేసింది. ఫలక్‌నుమా-ఉందానగర్‌ మధ్య విద్యుదీకరణతో డబ్లింగ్‌ లైను పనులను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. అందుకు అవసరమైన పలు అభివృద్ధి పనులను చేపట్టింది.

mmts
ఎంఎంటీఎస్​ రెండో దశ పనులు వేగవంతం

By

Published : Mar 28, 2021, 2:34 AM IST

దక్షిణ మధ్య రైల్వే ఎం‌ఎం‌టీఎస్‌ రెండో దశ ప్రాజెక్టులో మరో ముందడుగుపడింది. ఫలక్‌నుమా-ఉందానగర్‌ మధ్య విద్యుదీకరణతో డబ్లింగ్‌ లైను పనులను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. 13.98 కిమీ దూరం గల ఫలక్‌నుమా-ఉందానగర్‌ మధ్య నూతన డబుల్‌ లైన్‌ నిర్మాణాన్ని పూర్తి చేసింది. వీటికి సంబంధించిన ట్రాక్‌ డబ్లింగ్‌, విద్యుదీకరణ పనులకు అనుబంధంగా కావాల్సిన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను చేపట్టింది. ఈ పనులతో ఎంఎంటీఎస్ రెండో దశ పనులు చివరి దశకు చేరుకున్నాయని రైల్వే అధికారులు తెలిపారు.

17 ఏళ్లుగా సేవలు

ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టులో భాగంగా ఏడు పనులలో ఐదు పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ జంటనగరాల్లో సబర్బన్‌ రవాణాలో మల్టీ మోడల్‌ ట్రాన్ప్‌పోర్ట్‌ సర్వీసు (ఎం‌ఎం‌టీఎస్‌) అతి తక్కువ ఛార్జీలతో 17 ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తోంది. 2003-04లో 48 సర్వీసులతో ఆరు కోచ్​లతో ఎంఎంటీఎస్ సేవలు ప్రారంభమయ్యాయి. మొదట్లో 13వేల మంది ఇందులో ప్రయాణించేవారు. 2011-12లో సర్వీసుల సంఖ్య 121కి పెంచగా ప్రయాణికుల సంఖ్య 1.25 లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం 1.65లక్షల మంది వీటిలో తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. మొదట సికింద్రాబాద్-లింగంపల్లి, హైదరాబాద్-లింగంపల్లి మధ్య 29 కి.మీల దూరం ఎంఎంటీఎస్ రైళ్లు 2003 సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. తర్వాత 15 కి.మీలు దూరం గల సికింద్రాబాద్, ఫలక్​నుమా సెక్షన్​లో ఫిబ్రవరి 2014లో ప్రారంభమయ్యాయి. జంటనగరాల్లో ఎంఎంటీఎస్ ఫలక్​నుమా-సికింద్రాబాద్, హైదరాబాద్-బేగంపేట్-లింగంపల్లిల మధ్య 42 కి.మీల దూరం వరకు 26 రైల్వే స్టేషన్లతో నగరం తూర్పు నుంచి పడమరకు విస్తరించింది. సబర్బన్‌ సర్వీసులను మరింత విస్తరించానే దృష్టితో ఎంఎం‌టీఎస్‌ రెండో దశ 84 కి.మీ వరకు విస్తరించాలని నిర్ణయించారు.


ఐదు నూతన స్టేషన్ల నిర్మాణం

తెల్లాపూర్‌ రామచంద్రాపురం మధ్య నూతన రైల్వే లైను కోసం అధికారులు సికింద్రాబాద్‌ బొల్లారం మధ్య విద్యుదీకరణ పనులను చేపట్టారు. రద్దీ నివారణకు, మరిన్ని రైళ్లను నడపడానికి వీలుగా ఘట్​కేసర్‌-మౌలాలి మధ్య విద్యుదీకరణ, ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ పనులతో (ప్రస్తుతమున్న డబుల్‌లైన్‌ స్థానంలో) నాలుగు వరుస రైల్వే లైనులు పూర్తిచేశారు. ఫలక్‌నుమా-ఉందానగర్‌ మధ్య విద్యుదీకరణతో పాటు డబ్లింగ్‌ పనులు పూర్తి చేశారు. మౌలాలి-మల్కాజిగిరి-సీతాఫల్​మండీ మధ్య డబ్లింగ్‌ విద్యుదీకరణ పనులను చేపట్టారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ సెక్షన్‌లో 5 నూతన స్టేషన్ల నిర్మాణంతో పాటు మౌలాలి-సనత్‌నగర్​ల మధ్య విద్యుదీకరణతో పాటు డబ్లింగ్‌ పనులను చేపట్టారు. రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌) ఈ పనులను దశల వారీగా చేపట్టింది. అంతకుముందే, తెల్లాపూర్‌-రామచంద్రాపురం మధ్య నూతన రైల్వే లైను పనులు, సికింద్రాబాద్‌-బొల్లారం మధ్య విద్యుదీకరణ పనులు, బొల్లారం-మేడ్చల్‌ మధ్య విద్యుదీకరణ, డబ్లింగ్‌ పనులు, మౌలాలి-ఘట్​కేసర్‌ మధ్య నాలుగు లైన్ల పనులు పూర్తి చేశారు. ఇప్పుడు ఫలక్‌నుమా-ఉందానగర్​ల మధ్య విద్యుదీకరణ పనులతో పాటు డబుల్‌ లైన్‌ నిర్మాణం పనులతో ఎంఎం‌టీఎస్‌ రెండో దశ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇంకా...మౌలాలి-మల్కాజిగిరి-సీతాఫల్​మండి సుమారు 10కి.మీల పనులు, మౌలాలి-సనత్ నగర్ మధ్య 22 కి.మీలు నిర్మాణ పనులు పెండింగ్​లో ఉన్నాయి. ఇవి పూర్తయితే...రెండో దశ ఎంఎంటీఎస్ పనులు పూర్తయినట్లే అని రైల్వేశాఖ పేర్కొంది.

సరుకు రవాణా రైళ్ల నిర్వహణకు అనుకూలం

కర్నూల్‌ సిటీ, గుంతకల్‌, బెంగుళూరు, సికింద్రాబాద్‌, కాచిగూడ స్టేషన్లకు అనుసంధానంలో ఫలక్‌నుమా-ఉందానగర్‌ రైల్వే లైన్‌ ముఖ్యమైనది. ఏపీ కర్నాటక సంపర్క్‌ క్రాంతి రైళ్లతో సహా అనేక ప్రయాణికుల రైళ్ల సర్వీసులు ఈ మార్గం మీదుగా నడుస్తాయి. ఈ మార్గంలో విద్యుదీకరణతో పాటు డబుల్‌ లైన్‌ నిర్మాణం పనులతో ఈ ముఖ్యమైన సెక్షన్‌లో రైళ్ల రద్దీ నివారణకు తోడ్పడుతుందని రైల్వే అధికారులు వివరించారు. అన్ని రకాల రైళ్ల (సబర్బన్‌, ప్యాసింజర్‌,ఎక్ప్‌ప్రెస్‌) నిర్వహణ సామర్థ్యం దీంతో మెరుగవుతుందని రైల్వేశాఖ తెలిపింది. అంతేకాక మరిన్ని సరుకు రవాణా రైళ్ల నిర్వహణకు ఈ మార్గం అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. ఫలక్‌నుమా-ఉందానగర్‌ సెక్షన్‌లోని ఫలక్‌నుమా, ఎన్‌పీఏ శివరాంపల్లి, బుద్వేల్‌, ఉందానగర్‌ నాలుగు స్టేషన్లలో నూతన స్టేషన్‌ భవనాలు, హైలెవల్‌ ప్లాట్‌ఫాంలు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జీలు, వైడ్‌ సర్క్యులేటింగ్‌ ఏరియా, పార్కింగ్‌ వసతులతో సహా ప్రయాణికులకు అసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. సెక్షన్‌లో భారీ, చిన్న వంతెనలతో సహా 24 వంతెనలను నిర్మించారు. సెక్షన్‌లో ఉన్న 6 లెవల్‌ క్రాసింగ్‌ గేట్లలో ఒక ఆర్‌యూబీ నిర్మించారు. మిగిలిన 5 ఎల్‌సీ గేట్ల వద్ద సిగ్నల్‌ ఇంటర్‌ లాకింగ్‌ ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

ఇదీ చదవండి:పీఎం స్వనిధి మైక్రో క్రెడిట్ స్కీమ్ అమలులో జీహెచ్ఎంసీ టాప్

ABOUT THE AUTHOR

...view details