తెలంగాణ

telangana

ETV Bharat / city

జొన్న రైతు గోడు.. పట్టించుకునేదెవ్వరు.. - Sorghum crop purchase

Sorghum Crop : గత యాసంగి నుంచి వరి సాగు వద్దని.. జొన్న వంటి ఆరుతడి పంటలు వేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ భారీగా ప్రచారం చేసింది. వరి వేస్తే ధాన్యం కొనుగోలు చేయరేమో అని భావించి చాలా మంది రైతులు జొన్న సాగు చేశారు. కానీ ఇప్పుడు మద్దతు ధరకు కొనే వారు లేక.. పెట్టుబడి కూడా తిరిగి రాక జొన్న రైతులు ఆవేదన చెందుతున్నారు. వ్యాపారులు మద్దతు ధరకన్నా క్వింటాకు రూ.500 తక్కువ ఇస్తామంటున్నారని వాపోయారు.

Sorghum Crop
Sorghum Crop

By

Published : Jun 12, 2022, 8:42 AM IST

Sorghum Crop : చెమటోడ్చి జొన్న పండించిన రైతుల వేదన వర్ణనాతీతంగా ఉంది. గత అక్టోబరు నుంచి యాసంగి సీజన్‌ మొదలైనప్పుడు వరిసాగు వద్దని, జొన్న వంటి ఆరుతడి పంటలు వేస్తే రైతులకు అధిక ఆదాయం వస్తుందంటూ వ్యవసాయశాఖ భారీగా ప్రచారం చేసింది. అది నమ్మి జొన్న సాగుచేస్తే ఇప్పుడు మద్దతు ధరకు కొనేవారూ లేక, పెట్టుబడులూ తిరిగి రాక రైతులు గొల్లుమంటున్నారు.

జొన్న సాధారణ విస్తీర్ణం 75,274 ఎకరాలైతే ఏకంగా 67శాతం అదనంగా పెంచి లక్షా 26వేల ఎకరాలలో వేశారు. గత వానాకాలం(2021 జూన్‌ నుంచి సెప్టెంబరు) సీజన్‌లో సాధారణం లక్షా 18వేల ఎకరాలైతే అంతకన్నా 68శాతం తగ్గించి 37,725 ఎకరాల్లోనే సాగుచేశారు. యాసంగిలో వరి వద్దని ప్రభుత్వం చెప్పడంతో ఎక్కువమందిజొన్నవైపు మొగ్గుచూపారు. తీరా పంట చేతికొచ్చాక పరిస్థితి తారుమారైంది. ఇపుడు మద్దతు ధర కోసం అధికారులను అడిగితే ముఖం చాటేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

Sorghum Crop sales : ఈ పంట మద్దతు ధర క్వింటాకు రూ.2,738 ఇవ్వాలని కేంద్రం ప్రకటించినా.. వ్యాపారులు రూ.1500-2000లోపే కొంటున్నందున రైతులు నష్టపోతున్నారు. దేశంలో క్వింటా జొన్నలను పండించాలంటే రైతులు రూ.1977 చొప్పున పెట్టుబడి పెడుతున్నట్లు సగటున లెక్కతేలిందని దీనిపై అదనంగా 50శాతం కలిపి రూ.2970 చొప్పున కొత్త మద్దతు ధర ఇవ్వాలని కేంద్రం 3రోజుల క్రితం ప్రకటించింది. ఈ ధర 2022 అక్టోబరు నుంచి వచ్చే కొత్త జొన్నపంటకు ఇవ్వాలని సూచించింది. కానీ యాసంగి జొన్నలకు కనీసం పెట్టుబడి వ్యయం రూ.1977 కూడా రాక రైతులు నష్టపోతున్నారు.

చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు తిరుపతిరెడ్డి. ఆదిలాబాద్‌ జిల్లా తాంసిలో గత జనవరి నుంచి ఏప్రిల్‌ వరకూ యాసంగి పంటగా జొన్న వేశారు. మూడెకరాల్లో సాగుకు సుమారు రూ.60వేల పెట్టుబడి పెట్టగా 52 క్వింటాళ్ల వరకూ దిగుబడి వచ్చింది. మార్కెట్‌కు తీసుకెళితే కొనేవారు లేక ఇలా ఇంట్లోనే నిల్వ చేశారు. ఎక్కువ కాలం ఇలా ఉంచడం వల్ల ఎలుకలు పాడుచేస్తున్నాయని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు మద్దతు ధరకన్నా క్వింటాకు రూ.500 తక్కువ ఇస్తామంటున్నారని వాపోయారు.

సొమ్ము లేకనే అనుమతి రాలేదా!?...మద్దతు ధరకు కొనాలని రైతులు కోరుతున్నందున కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు అనుమతించాలని ‘రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య’(మార్క్‌ఫెడ్‌) పక్షం రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. గత యాసంగిలో వాతావరణం అనుకూలించినందున మొత్తం 13.13 లక్షల క్వింటాళ్ల జొన్నల దిగుబడి వచ్చిందని వీటిని కొని రైతులకు మద్దతు ధర చెల్లించాలంటే రూ.400 కోట్లు కావాలని వివరించింది. ఈ సొమ్ము సమాఖ్య వద్ద లేనందున బ్యాంకుల నుంచి రుణంగా తీసుకునేందుకు ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వాలని కోరింది. అది ఇంతవరకూ లభించకపోవడం, బ్యాంకులు నేరుగా సమాఖ్యకు రుణాలివ్వడానికి ముందుకు రాకపోవడంతో మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలు తెరవలేదు.

గతేడాదీ ఇలాగే రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ రెండోవారం దాకా అనుమతించకపోవడంతో అప్పుడు కురిసిన తొలకరి వర్షాలకు జొన్నలు తడిసి రైతులు నష్టపోయారు. ఇప్పటికే రైతులు వానాకాలం పంటల సాగుకు పెట్టుబడులకు సొమ్ము దొరక్క.. తమవద్ద ఉన్న జొన్నలను వ్యాపారులకు అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఇలా తక్కువ ధరలకు వారు కొంత పంటను కొనేశాక ప్రభుత్వం తీరిగ్గా అనుమతిస్తే వ్యాపారులే తిరిగి ఆ పంటను మద్దతు ధరకు మార్క్‌ఫెడ్‌కు అమ్ముకుని లాభపడనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సత్వరం స్పందించి తమను ఆదుకోవాలని జొన్నరైతులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details