వచ్చే నెల ఏడో తేదీ నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు వేగవంతం చేసింది. సంబంధిత బిల్లు ముసాయిదా రూపొందించే ప్రక్రియ కొనసాగుతోంది. అది సిద్ధమయ్యాక మంత్రివర్గం సమావేశంలో చర్చించి... ఆమోదించాక.. శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం కేబినెట్‌ను త్వరలోనే సమావేశపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ అంశం...
అటు నీటిపారుదల శాఖ పేరు మార్పు, పునర్వ్యవస్థీకరణ అంశం కూడా మంత్రివర్గం ముందుకు రానుంది. రాష్ట్రంలో సాగునీటి వసతి భారీగా పెరిగిన నేపథ్యంలో శాఖను అందుకు తగ్గట్లుగా పునర్వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. అందుకు అనుగుణంగా అధికారులు, ఇంజినీర్లు కసరత్తు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్ సైతం పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపై పలుమార్లు సమీక్షించారు. శుక్రవారం మరోమారు సమీక్షించిన సీఎం... పలు మార్పులు, చేర్పులు చేశారు. దీంతో నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తైంది. శాఖ పేరును కూడా జలవనరుల శాఖగా మార్చాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. వీటిపై కూడా కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.