దిల్లీ రాంలీలా మైదానం వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన.. భారత్ బచావో ర్యాలీ విజయవంతం కావడంతో అదే తరహాలో రాష్ట్రంలో జరపాలని.. రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తోంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఒకేరీతిలో ఉన్నందున పోరాటానికి సిద్ధం కావాలని నేతలు నిర్ణయించారు. కేసీఆర్ చేతుల్లో నుంచి రాష్ట్రాన్ని కాపాడండి "కేసీఆర్ హాత్ సే తెలంగాణ బచావో" పేరుతో ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని సూత్రప్రాయంగా అంగీకరించారు.
పల్లెపల్లెన నిరసనలు, ధర్నాలు
దిల్లీలో భారత్ బచావో ర్యాలీ తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా నేతృత్వంలో సమావేశమైన నేతలు ఈ మేరకు సమాలోచనలు చేశారు. గ్రామ గ్రామాన కార్యక్రమాలు నిర్వహించేందుకు పథక రచన చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. తెరాస సర్కారు విధానాలు పల్లెపల్లెన ఎండగట్టేలా కార్యచరణకు సిద్ధం కావాలని భేటీలో నిర్ణయించారు.