తెలంగాణ

telangana

ETV Bharat / city

కురుస్తున్న వర్షం.. నానుతున్న దస్త్రం! - telangana tehasilder latest ews

వర్షాలకు ఇల్లు కూలినా, గోడ పడిపోయినా, పంట నీట మునిగినా.. పరిహారం మంజూరుకు ప్రభుత్వానికి నివేదికలు పంపించేది తహసీల్దార్లు, ఆ కార్యాలయ సిబ్బందే. అయితే... తహసీల్దారు కార్యాలయ భవనాలే వర్షపు నీటితో దెబ్బతింటూ శిథిలావస్థకు చేరుకుంటున్నా.. నిధుల మంజూరుకు అతీగతి లేకుండా పోతోంది. మరమ్మతులు కరవవుతుండటంతో వర్షాలకు విలువైన దస్త్రాలు నానిపోతున్నాయి.

MRO OFFICE
MRO OFFICE

By

Published : Sep 2, 2020, 7:09 AM IST

రాష్ట్రంలోని పలు మండలాల్లోని తహసీల్దారు కార్యాలయాల భవనాలు వర్షాలకు ఊటలు కారుతున్నాయి. దీంతో ఉద్యోగులు ఇబ్బందుల మధ్య విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్ని కార్యాలయాల్లో వర్షాకాలంలో అడుగుపెట్టేందుకే సిబ్బంది జంకుతున్నారు. ప్రధానంగా విలువైన భూదస్త్రాలు వర్షపు నీటికి నానుతూ ఉనికి కోల్పోతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో మొత్తం 594 మండల తహసీల్దారు కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో 135 మండలాలు 2016 తరువాత ఏర్పాటు చేసినవి.

పెచ్చులూడి ప్రమాదకరంగా

ఉమ్మడి రాష్ట్రంలో 459 మండలాలు ఉండగా దాదాపు వీటన్నింటికీ పాత భవనాలే ఉన్నాయి. ఈ భవనాలు వర్షాలకు ఉరుస్తున్నాయి. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో పెచ్చులూడి ప్రమాదకరంగా తయారయ్యాయి. ప్రభుత్వం కొన్ని మండలాల తహసీల్దార్లకు సబ్‌ రిజిస్ట్రార్‌ అధికారాలను కూడా అప్పగించింది. మున్ముందు రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియను తహసీల్దార్లే పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సేవలు ప్రారంభమైతే మరిన్ని దస్త్రాలను నిల్వ చేయాల్సి ఉంటుంది.

మరమ్మతులకు నిధులు కరవు

భవనాల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో భూ సేకరణ నిధులకు సంబంధించి బ్యాంకుల ద్వారా వచ్చే వడ్డీని కార్యాలయాల బాగుకోసం వినియోగించే వారు. నీటి తీరువా వసూళ్లు కొనసాగిన కాలంలో ఆ నిధుల నుంచి ఐదు శాతం కార్యాలయాల నిర్వహణకు కేటాయించేవారు. తీరువా వసూళ్లను ప్రభుత్వం రద్దు చేయడంలో ప్రస్తుతం ఆ మొత్తం కూడా అందడం లేదు. ఇలా నిధుల కొరత కారణంగా భవనాలు మరమ్మతుకు నోచుకోవడం లేదని తహసీల్దారు కార్యాలయ ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు.

మచ్చుకు కొన్ని..

  • ఐటీడీఏ ఉపాధ్యాయుల క్వార్టర్‌లో 1985లో ఏర్పాటు చేసిన మహబూబాబాద్‌ జిల్లా పాకాల కొత్తగూడ మండల తహసీల్దారు కార్యాలయ భవనం వర్షాలకు ఉరుస్తోంది. గంగారం మండలంలో శిథిలావస్థకు చేరుకున్న రెండు గదుల్లోనే కార్యాలయం కొనసాగుతోంది.
  • జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల తహసీల్దారు కార్యాలయం చిన్నపాటి వర్షానికే ఉరుస్తోంది.
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల తహసీల్దారు కార్యాలయం ఉరుస్తూ పైకప్పు ప్రమాదకరంగా మారింది. 1996లో నిర్మించిన ఈ భవనానికి కనీస మరమ్మతులు చేపట్టలేదు.
  • ఇటీవల కురిసిన వర్షాలకు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి తహసీల్దార్‌ కార్యాలయ దస్త్రాలు తడిసిపోయాయి.
  • ఇదే జిల్లా రాయికోడ్‌ కార్యాలయం పైకప్పు వర్షానికి పెచ్చులూడిపోతూ ప్రమాదకరంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details