Private Schools Fee : కరోనా పరిస్థితుల్లో ట్యూషన్ ఫీజులను పెంచొద్దని రాష్ట్ర ప్రభుత్వం గత రెండు విద్యా సంవత్సరాలకు జీవోలు జారీచేయడంతో ఆ మొత్తాన్ని రికవరీ చేసుకునేందుకు ఇపుడు పలు ప్రైవేట్ పాఠశాలలు తహతహలాడుతున్నాయి. ప్రాథమిక విద్య.. అంటే 5వ తరగతి నుంచి ఆరో తరగతిలోకి వెళ్లేవారికి 15-30 శాతం వరకు పెంచి వసూలు చేస్తున్నాయి. స్లాబ్ మార్పు పేరిట ఈ పెంపును అమలుచేస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని ఇంటర్నేషనల్, సీబీఎస్‌ఈ బోర్డు అనుబంధ పాఠశాలలు ఒక్కసారిగా జూలు విదిలిస్తున్నాయి. స్లాబ్ మారకుండా ఉన్నచోట 10 శాతంలోపు పెంచుతున్నాయి. ఉదాహరణకు 4 నుంచి 5వ తరగతిలోకి ప్రవేశించినప్పుడు పెంపు 10 శాతంలోపే ఉంటుంది. అదే స్లాబ్ మారితే మోత తప్పదు. ఫీజుల నియంత్రణ చట్టం కోసం విధివిధానాల రూపకల్పనకు నియమించిన 13మంది మంత్రుల ఉపసంఘం మార్చి 2న సమావేశమైంది. 10 శాతంలోపు పెంచుకునేందుకు తీర్మానించింది. దానిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈక్రమంలో కొత్త విద్యా సంవత్సరానికి ఫీజులు పెంచుకోవచ్చని భావించిన పలు పాఠశాలల యాజమాన్యాలు.. కొత్త ఫీజులను ఖరారుచేసి తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్నాయి.
ఆర్డినెన్స్ తేవటమే ఏకైక మార్గం..పాఠశాలల ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని గత జనవరి 17న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. అది మార్చి 2న సమావేశమైంది. మరోసారి సమావేశమై చర్చించాలని భావించారు. చట్టం తేవాలంటే బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంది. అందుకు అంతా సిద్ధమైనా ఎందుకో ఆగిపోయింది. ఇక వచ్చే విద్యా సంవత్సరానికి చట్టం చేయాలంటే మళ్లీ ఇప్పట్లో అసెంబ్లీ సమావేశాలు లేనందున గవర్నర్‌తో ఆర్డినెన్స్ ఇప్పించడమే ప్రభుత్వం ముందున్న ఏకైక మార్గమని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి ఏదో ఒకటి చేయని పక్షంలో మరిన్ని ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.