అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించిన ప్రజాప్రతినిధులు పలువురు కన్పిస్తారు. ఆయా నియోజకవర్గాల రిజర్వేషన్లు ఎప్పుడో ఒకసారికానీ మారవు. దీంతో ఒకే నేత ఎక్కువసార్లు పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితులుంటాయి. ప్రతి ఐదేళ్లకోసారి రిజర్వేషన్లు మారిపోతుంటాయి. దీంతో కొత్తవారికి సీట్లు కేటాయిస్తుంటారు. ఈ దఫా ప్రభుత్వం రిజర్వేషన్ల వ్యవధిని పదేళ్లకు పెంచింది. ఫలితంగా ఎక్కువమందికి గ్రేటర్ ఎన్నికల్లో తిరిగిపోటీ చేసే అవకాశం దక్కింది.
అటు నుంచి ఇటు మారి..
అంతకుముందు తెదేపా, భాజపా నుంచి విజయం సాధించిన కొందరు గత ఎన్నికల్లో తెరాస తరఫున గెలుపొంది కార్పొరేటర్లు అయ్యారు. వారిలో ఎక్కువమంది ఈ సారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరిలో మహిళా అభ్యర్థులు ఉండటం విశేషం.
గాంధీనగర్ నుంచి ముఠా పద్మ..
ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గాంధీనగర్ డివిజన్‌లో 2009లో తెదేపా నుంచి ముఠా పద్మ విజయం సాధించారు. 2016 ఎన్నికల్లో ఆమె తెరాస తరఫున గెలుపొందారు. ఈ సారి కూడా ఆమెకే టికెట్ లభించింది. ఎమ్మెల్యే ముఠా గోపాల్ కుటుంబ సభ్యురాలు కావడం, ప్రస్తుతం ఈ డివిజన్ ఇన్‌ఛార్జిగా ఎమ్మెల్సీ కవిత ఉండటంతో కార్యకర్తలు ఆమె విజయానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.
హిమాయత్‌నగర్‌లోనూ...
తెరాస నుంచి ప్రస్తుతం పోటీ చేస్తున్న హేమలతాయాదవ్ హ్యాట్రిక్‌పై గురిపెట్టారు. 2009లో తెదేపా నుంచి హిమాయత్‌నగర్ డివిజన్‌లో ఆమె గెలుపొందారు. 2016లో తెరాస అభ్యర్థిగా విజయం సాధించారు. ఈ దఫా కూడా పోటీలో కొనసాగుతున్నారు.
‘కాజ’ సైతం..
జూబ్లీహిల్స్ డివిజన్ నుంచి కాజ సూర్యనారాయణ 2009లో తెదేపా నుంచి.. 2016లో తెరాస తరఫున గెలుపొందారు. ఈ ఎన్నికల్లోనూ బరిలో నిలిచిన ఆయన మూడో దఫా గెలుపుపై దృష్టిపెట్టారు.
ఆ నలుగురు వీరే...
* మజ్లిస్ పార్టీ అభ్యర్థి ఎంఏ గఫర్‌ది కొత్త రికార్ఢు వరుసగా నాలుగు ఎన్నికల్లోనూ గెలుపొందారు. హుస్సేనీ ఆలం నుంచి రెండుసార్లు గెలవగా.. 2009, 2016లో బహుదూర్‌పురా నియోజకవర్గంలోని దూద్‌బౌలి నుంచి విజయం సాధించారు. ఆయన్ను ఎమ్మెల్సీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ దఫా కొత్త అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టారు.
* చాంద్రాయణగుట్టలోని రియాసత్‌నగర్ డివిజన్‌లో మజ్లిస్ తరఫున ముస్తఫాబేగ్ మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలిచారు. 2002, 2009, 2016లో విజయం సాధించారు. ప్రస్తుతం నాలుగోసారి పోటీ చేస్తున్నారు.
* బహుదూర్‌పుర నియోజకవర్గంలోని రామ్‌నాస్‌పురా డివిజన్ నుంచి మజ్లిస్ తరఫున మహ్మద్ ముబీన్ హ్యాట్రిక్ సాధించారు. 2002లో ఆగాపురా నుంచి 2009, 2016లో రామ్‌నాస్‌పురా నుంచి గెలుపొందారు. ఈసారి శాస్త్రీపురం నుంచి ఆయన పోటీచేస్తున్నారు.
* గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బేగంబజార్ డివిజన్‌లో భాజపా నుంచి గొంటి శంకర్‌యాదవ్ హ్యాట్రిక్ నమోదు చేశారు. 2002, 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందగా.. 2016లో భాజపా తరఫున విజయం సాధించారు. ఈసారి కూడా ఎన్నికల్లో తలపడుతున్నారు.
మళ్లీ మెహిదీపట్నం నుంచి..
నగర మాజీ మేయర్, మజ్లిస్ పార్టీ నేత మాజిద్ హుస్సేన్ హ్యాట్రిక్ రేసులో ఉన్నారు. 2009 ఎన్నికల్లో అహ్మద్‌నగర్ డివిజన్ నుంచి తొలిసారిగా గెలుపొందారు. పార్టీ అధిష్ఠానం అశీస్సులతో ఆయన్ను మేయర్ పదవి వరించింది. 2016లో మెహిదీపట్నం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఇక్కడి నుంచే బరిలో దిగిన ఆయన హ్యాట్రిక్ పక్కా అంటున్నారు.
గుడిమల్కాపూర్‌లో..
తెరాస అభ్యర్థి బంగారి ప్రకాశ్ మూడోసారి గెలుపుపై దృష్టిపెట్టారు. 2009లో భాజపా నుంచి గుడిమల్కాపూర్ కార్పొరేటర్‌గా గెలుపొంది ఫ్లోర్‌లీడర్ అయ్యారు. 2016లో తెరాస నుంచి విజయం దక్కించుకున్నారు. ఈ సారి కూడా బరిలో ఉన్న ఆయన హ్యాట్రిక్ వైపు చూస్తున్నారు.