ఏపీలోని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులోని కేవీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.. సూర్యరశ్మిని ఒడిసిపట్టి విద్యుత్ అవసరాలను తీర్చుకుంటోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో సుమారు మూడు లక్షల రూపాయల విలువైన 4 సోలార్ ప్యానెల్లు పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఒక్కో ప్యానల్ నుంచి రోజుకు నాలుగు యూనిట్లు చొప్పున మొత్తంగా 16 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.
ఈ సోలార్ యూనిట్‌ను విద్యుత్ శాఖ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఫలితంగా పాఠశాల అవసరాలకు మించి ఉత్పత్తి అయిన కరెంట్.. గ్రిడ్ ద్వారా బయటకు పంపిణీ చేస్తున్నారు. ఒకవేళ ఉత్పత్తి తక్కువయితే దాన్ని తిరిగి పాఠశాలకు సరఫరా అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు.
పాఠశాలలో మొత్తం 650 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరి అవసరాలకు 20 తరగతి గదులు ఉన్నాయి. ప్రతి గదిలో ఐదు ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇవన్నీ ఈ సౌర విద్యుత్ ద్వారానే పనిచేస్తున్నాయి.