ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచీ శనివారం వరకూ రాష్ట్రవ్యాప్తంగా 7.55 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఎల్‌ఆర్‌ఎస్ కోసం ప్రభుత్వం ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువచ్చిన వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవడానికే అవకాశముంది. దరఖాస్తుల స్వీకరణ అనంతరం వాటిని పరిశీలిస్తూ ఆర్జీదారుల నుంచి రుసుం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను చేపట్టడానికి అవసరమైన సాఫ్ట్‌వేర్ ప్రస్తుతమున్న వెబ్‌సైట్‌లో అందుబాటులో లేదు. ఫలితంగా ఇప్పట్లో మలిదశ ప్రక్రియ పూర్తవుతుందా లేదా అన్న అయోమయం నెలకొంది. సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) కసరత్తు చేస్తున్నా.. అది ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుంది అన్న స్పష్టత కరవైంది.
అంచనాలకు మించి దరఖాస్తులు..
ప్రభుత్వం గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చినా ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. తాజాగా అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం నిలిపివేసింది. అనంతరం ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించిన ప్రభుత్వం..‘క్రమబద్ధీకరణ’కు ఇది చివరి అవకాశమని స్పష్టం చేసింది. ఇదిలాఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షలకుపైగా, పట్టణాల్లో 4 లక్షల దాకా అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ స్థలాలు ఉన్నట్లు అధికారుల సర్వేలో వెల్లడైంది. దీంతో వీటి క్రమబద్ధీకరణ కోసం అంచనాలకు మించి దరఖాస్తులు వస్తున్నాయి. ప్రభుత్వం విధించిన గడువు(ఈ నెల 15)లోపు మరికొన్ని వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశముంది.