తెలంగాణ

telangana

ETV Bharat / city

భాయ్‌ కుట్ర.. కూలీల పాలిట శాపం - కడప సమ్మగ్లర్ల ప్రమాదం విచారణ

చేసేదే దొంగపని...! అందులోనూ కక్కుర్తికి పోయి ఓ బడా స్మగ్లర్‌ పన్నిన పన్నాగం.. ఐదుగురు కూలీల ప్రాణాలు తీసింది. సరకు తన దగ్గరకు చేర్చేందుకు ఇస్తున్న సొమ్ము ఎక్కువ అని భావించి.. దాన్ని ఎగ్గొట్టేందుకు వేరే గ్యాంగ్‌తో బేరం మాట్లాడుకున్నాడు. వెంబడిస్తున్న వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన కూలీలు టిప్పర్‌ను ఢీకొన్నారు. ఏపీలోని కడప జిల్లాలో ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్ల మృతి కేసులో కొత్త కోణాలు వెలుగుచూశాయి.

smuggler bhasah bhai behind the kadapa accident and 5 members smugglers death  incident
భాయ్‌ కుట్ర.. కూలీల పాలిట శాపం

By

Published : Nov 4, 2020, 11:22 AM IST

భాయ్‌ కుట్ర.. కూలీల పాలిట శాపం

ఏపీలోని కడప జిల్లా వల్లూరు మండలం గోటూరు వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. బెంగళూరు కేంద్రంగా అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందని తేల్చారు. తమిళ కూలీలకు డబ్బులు ఎగ్గొట్టేందుకు స్మగ్లర్‌ బాషాభాయ్‌ పన్నిన వ్యూహం బెడిసికొట్టిన నేపథ్యంలో ఇప్పుడు పోలీసులకు అతనే ప్రథమ లక్ష్యం అయ్యాడు.

రూ.25 లక్షలకు బేరం..

అంతర్రాష్ట్ర స్మగ్లర్‌ బాషాభాయ్‌ సూచనతో వారం క్రితం తమిళనాడు నుంచి 8 మంది ఎర్రచందనం కూలీలు కడప జిల్లాకు చేరుకున్నారు. సిద్ధవటం మండలం భాకరాపేట అడవుల్లో ప్రవేశించి చెట్లను నరికి దుంగలు సిద్ధం చేశారు. సాధారణంగా చెట్లు నరకటం వరకే కూలీల పని. వాటిని గమ్యస్థానం చేర్చేందుకు మరో గ్యాంగ్‌ ఉంటుంది. అయితే ఈసారి ఆ రెండు బాధ్యతలనూ కూలీలకే అప్పగించాడు బాషాభాయ్‌. 18 దుంగలను స్కార్పియోలో బెంగళూరుకు చేర్చేందుకు రూ.25 లక్షలకు బేరం కుదిరింది. బేరం కుదిరిన తర్వాత పునరాలోచించిన బాషాభాయ్‌.. అంత డబ్బు దండగ అనుకున్నాడు.

మరో రహస్య బేరం..

దుంగలను స్వాధీనం చేసుకోవాలంటూ.. కడపలోని హైజాక్‌ గ్యాంగ్‌తో రూ.10 లక్షలకు మరో రహస్య బేరం చేసుకున్నాడు. ఆ గ్యాంగ్‌లోని ముగ్గురు ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎథియోస్‌ వాహనంలో కడపలోనే కాపుకాశారు. బెంగళూరు నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని.. సోమవారం వేకువజామున కడపకు చేరుకున్న కూలీల స్కార్పియో వాహనాన్ని గుర్తించారు. రాజంపేట బైపాస్‌ రోడ్డు నుంచే వారిని వెంబడించారు. ఇర్కాన్ కూడలి వద్ద వాహనంతో ఢీకొట్టేందుకు విఫలయత్నం చేశారు. తమను ఎవరో వెంబడిస్తున్నారని తెలుసుకున్న కూలీలు... పులివెందుల రింగ్‌రోడ్డు వరకూ వెళ్లి తిరిగి వెనక్కి వచ్చి తాడిపత్రి వైపు వెళ్లారు. అదే మార్గంలో వేగంగా వెళ్లిన సమయంలోనే గోటూరు వద్ద ప్రమాదానికి గురయ్యారు. వేగాన్ని నియంత్రించుకోలేక అడ్డుగా వచ్చిన టిప్పర్‌ను ఢీకొట్టారు. వారి వెనుకే వస్తున్న కడప గ్యాంగ్‌ వాహనమూ అంతేవేగంతో స్కార్పియోను ఢీకొట్టింది.

మిగిలిన ముగ్గురిలో..

ఈ ప్రమాదంలో కూలీలు రాజన్, చంద్రన్, మహేంద్రన్, రామచంద్రన్, మృత్తియన్ అక్కడికక్కడే మరణిచారు. మిగిలిన ముగ్గురిలో ఒకరు పోలీసుల అదుపులో ఉండగా ఇంకొకరు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్వల్పంగా గాయపడిన కడప గ్యాంగ్‌ సభ్యులు.. అక్కడి నుంచి పరారయ్యారు. కొన్నిగంటల్లోనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక ఎవరిహస్తమున్నా వదిలేది లేదని జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు.

ప్రమాదంలో మరణించిన ఐదుగురూ తమిళనాడులోని సేలం జిల్లాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. కేరళలో పనికి వెళ్తున్నట్టు చెప్పారని కుటుంబసభ్యులు తెలిపారు. వారికి ఇవాళ మృతదేహాలను అప్పగించనున్నారు. ప్రమాదానికి కారణమైన ప్రధాన స్మగ్లర్ బాషాభాయ్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఐదు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

ఇదీ చదవండి:నకిలీ ప్రభుత్వ పథకాలతో ఆన్​లైన్ మాయాజాలం

ABOUT THE AUTHOR

...view details