Handloom EveryDay Challenge: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో "హ్యాండ్లూమ్ ఎవ్రీడే(#Handloom #EveryDay) ఛాలెంజ్" ట్రెండింగ్‌లో ఉంది. ఈ ఛాలెంజ్‌ను ఎవరో సినీతారలో, క్రీడాకారులో విసురుకుంటున్నారనుకుంటే పొరపాటే.. ఈ సవాలును రాష్ట్రానికి చెందిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు విసురుకుంటున్నారు. అయితే.. ఈ ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టింది మాత్రం.. "తెలంగాణ ట్రెండీ వేర్‌కు బ్రాండ్"గా ఉన్న సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్. సాధారణంగానే.. చేనేత వస్త్రాలకు ప్రత్యేకతనిస్తూ నిత్యం వాటినే ధరించే స్మిత సబర్వాల్.. తోటి అధికారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. హ్యాండ్లూమ్ పరిశ్రమకు తనదైన రీతిలో ఆదరణ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు స్మిత సబర్వాల్. అయితే.. తానే కాకుండా తోటి అధికార వర్గమంతటినీ కూడా చేనేతకు ఆదరణ కల్పించటంలో భాగస్వామ్యం చేయాలనుకున్న స్మిత సబర్వాల్.. ఓ ట్రెండీ ఆలోచన చేశారు. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని.. నిన్ననే చేనేత చీరతో ఉన్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి.. ప్రతి రోజు చేనేత వస్త్రాలు ధరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాని ప్రకటించారు. అంతేకాకుండా.. ఈ ప్రతిజ్ఞలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఐపీఎస్ అధికారిణి షికాగోయల్ తదితరులను కూడా భాగస్వామ్యం చేశారు. అద్భుత కళాకారులైన నేత కార్మికలను ప్రోత్సహించేందుకు గానూ.. చేనేత దుస్తులు ధరించినప్పటి వాళ్లకు ఇష్టమైన ఫొటోను పోస్టు చేయాలని కోరారు.