తెలంగాణ

telangana

ETV Bharat / city

66 వేల డిగ్రీ సీట్లు మిగిలిపోయాయ్‌! - sixty thousand seats were left unfilled in Osmania University

కరోనా నేపథ్యంలో ప్రవేశాలు ఆలస్యమవ్వడం.. సాంకేతిక కోర్సుల వైపు విద్యార్థులు మొగ్గు చూపడం.. కారణాలు ఏవైనా 2020-21 సంవత్సరానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ సీట్లు భారీగా మిగిలిపోయాయి. ఏకంగా 66 వేల సీట్లు భర్తీ కాలేదు.

sixty-thousand-degree seats-were-left-unfilled-in-osmania-university-
ఉస్మానియా వర్సిటీలో మిగిలిపోయిన డిగ్రీ సీట్లు

By

Published : Jan 16, 2021, 8:53 AM IST

ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో 2020-21 ఏడాదికి డిగ్రీ సీట్లు భారీగా మిగిలిపోయాయి. హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మెదక్‌ జిల్లాల పరిధిలో డిగ్రీ కళాశాలలు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నాయి. వీటికి వర్సిటీ తరఫున అనుబంధ గుర్తింపు ఇస్తున్నారు. ఏటా డిగ్రీ కళాశాలల్లో సీట్లను దోస్త్‌ కార్యక్రమం కింద ఉన్నత విద్యామండలి భర్తీ చేస్తోంది.

వర్సిటీ పరిధిలో దోస్త్‌ కింద 352 కళాశాలలు ఉండగా.. మరో 45 ఆఫ్‌లైన్‌ విధానంలో ప్రవేశాలు తీసుకుంటున్నాయి. దోస్త్‌ కార్యక్రమంలో భాగంగా డిగ్రీ ప్రవేశాలను ఇటీవలే పూర్తి చేసింది. ఉస్మానియా వర్సిటీ పరిధిలో 1,48,210 సీట్లు ఉండగా.. 85,079 మాత్రమే భర్తీ అయ్యాయి. 63,131 సీట్లు మిగిలిపోయాయి. అలాగే ఆఫ్‌లైన్‌లోని కళాశాలల్లో సుమారు 15వేల సీట్లు ఉండగా.. 3 వేల సీట్లు మిగిలిపోయినట్లు అంచనా వేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

మిగులు సీట్లు ఎక్కువగా ప్రభుత్వ, ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ కళాశాలల్లోనే ఉన్నాయి. దోస్త్‌ కార్యక్రమంలో ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ విభాగంలో 287 కళాశాలల్లో 1,10,855 సీట్లు ఉన్నాయి. వీటిలో కేవలం 57,805 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. రైల్వే, ప్రైవేటు (అటానమస్‌) కళాశాలలు మినహా మిగిలిన అన్ని కళాశాల్లోనూ సీట్లు మిగిలిపోయాయి.

ఎందుకీ పరిస్థితి..

కరోనా కారణంగా డిగ్రీ ప్రవేశాలు బాగా ఆలస్యమయ్యాయి. గత డిసెంబరు ఆఖరు వరకు ప్రవేశాలు జరుగుతూనే ఉన్నాయి. వివిధ దశల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించింది. ఇంటర్మీడియట్‌లో సప్లిమెంటరీ లేకుండానే విద్యార్థులను ఉత్తీర్ణులను చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఎక్కువ మంది డిగ్రీలో చేరేందుకు ఆసక్తి చూపించారు. గతేడాదితో పోల్చితే ప్రవేశాలు ఎక్కువగా జరిగాయి. కానీ అందుబాటులో ఉన్న సీట్లను పరిగణనలోకి తీసుకుంటే ‘మిగులు’ ఎక్కువగా కనిపిస్తోంది. వాస్తవానికి 2018-19 సంవత్సరంలో 81వేల మంది విద్యార్థులు చేరగా.. 2019-20 సంవత్సరానికి 84,077 మంది విద్యార్థులు డిగ్రీ ప్రవేశాలు తీసుకున్నారు.

10 కళాశాలలు మూసివేత..!

ఈసారి 10 కళాశాలల్లో సున్నా ప్రవేశాలు జరిగినట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఆయా కళాశాలల్లో రెండు, మూడు సంవత్సరాలకు చెందిన విద్యార్థులు ఉన్నప్పటికీ మొదటి ఏడాదిలో మాత్రం ఒక్కరూ చేరలేదు. ఆయా కళాశాలలు మూసివేసే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లోని విద్యార్థుల చదువు పూర్తయ్యాక అవి మూతపడే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details