కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో వరద నిలకడగా కొనసాగుతోంది. రెండు రోజులుగా శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి సగటున రోజుకు అరవై టీఎంసీల నీరు దిగువకు వదులుతున్నారు. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు 12 గంటల వ్యవధిలో శ్రీశైలం నుంచి 32.80 టీఎంసీలు.. మొత్తంగా ఒక్కరోజులో 60 టీఎంసీలకు పైగా నీటిని దిగువకు విడుదల చేశారు.
సాగర్ నుంచి దిగువకు ఏడు లక్షల క్యూసెక్కుల ప్రవాహం
తుంగభద్ర, కృష్ణా నదుల నుంచి శ్రీశైలానికి ఎనిమిది లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దిగువకు కూడా అంతే స్థాయిలో వదులుతున్నారు. సాగర్ నుంచి దిగువకు ఏడు లక్షలు, పులిచింతల నుంచి ఏడున్నర లక్షల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు వెళ్తోంది.12 గంటల వ్యవధిలో సాగర్ ప్రాజెక్టుకున్న 26 క్రస్ట్‌గేట్ల ద్వారా 32.04 టీఎంసీలు, పులిచింతల నుంచి 33.56 టీఎంసీలు కిందికి వదిలారు.