ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతోంది. రాష్ట్ర ప్రభుత్వ చేపడుతోన్న రైతు సంక్షేమ కార్యక్రమాలతో పంటల సాగు రోజురోజుకు పెరుగుతోంది. వ్యవసాయ రంగంలో సంక్షోభంతో రైతు ఆత్మహత్యల నుంచి బయటపడేందుకు అనేక విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టింది. ఉచిత విద్యుత్, సాగునీరు, ఖరీఫ్, పెట్టుబడి సాయం అందిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగానికి అధిక నిధుల కేటాయింపుతో ఆహార ధాన్యాల దిగుబడులు రికార్డు స్థాయిలో వస్తున్నాయి. గత యాసంగి సీజన్లో ఏకంగా కోటి 4 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది.
రైతుబంధు, బీమా..
రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు ఎకరానికి ఏటా 10 వేల రూపాయలు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే రైతుబంధు పథకం దేశంలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ ఏడాది దీనికోసం రూ. 14 వేల కోట్లు కేటాయించింది. వరదలు, వడగండ్లు, ఇతర ప్రకృతి వైపరిత్యాలతో... 18 నుం 59 ఏళ్ల లోపు రైతు మరణిస్తే... బాధిత కుటుంబానికి తక్షణం రూ.5 లక్షలు అందించేందుకు రైతుబంధు బీమా పథకం అమలు చేస్తోంది. పిడుగుపాటుతో మరణిస్తే రూ. 6 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. తొలి విడత 2014లో రుణ మాఫీ పథకానికి రూ.16,500 కోట్లు, మలి విడత కోసం ఈ ఏడాది రూ. 9 వేల కోట్ల కేటాయించింది.