ఏపీలో ఆర్టీసీ సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. తొలుత రోజుకు సగటున 5-10 మందికి పాజిటివ్ వచ్చినట్లు గుర్తించగా.. ఇప్పుడు ఆ సంఖ్య 60-70కి చేరింది. ఆదివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 670 మంది ఆర్టీసీ సిబ్బందికి వైరస్ సోకింది. అత్యధికంగా కడప జోన్‌లో 260 మంది వరకు కొవిడ్ బారినపడ్డారు.
670 మంది ఆర్టీసీ సిబ్బందికి కరోనా పాజిటివ్
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అంతటా విస్తరిస్తోంది. ఇక ఆర్టీసీ సిబ్బంది ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటివరకు 670 మంది సిబ్బందికి పాజిటివ్ నిర్ధరణ అయింది.
ఆదివారం ఒక్కరోజే 71 మంది సిబ్బందికి కరోనా నిర్ధారణ కాగా.. ఇందులో 31 మంది కడప జోన్‌వారే. కొవిడ్ బారినపడి ఇప్పటి వరకు 10 మంది ఆర్టీసీ సిబ్బంది చనిపోయారు. కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ఏం చేయాలనే అంశంపై మంగళవారం ఉన్నతాధికారులతో ఎండీ చర్చించనున్నారు. ఆర్టీసీలో 12వేల బస్సులకుగాను ప్రస్తుతం నిత్యం సగటున 3వేలు నడుపుతున్నారు. గతంలో సగటున రూ.13 కోట్ల వరకు రోజువారీ రాబడి ఉండగా.. ఇప్పుడది రూ.2 కోట్లు కూడా దాటడం లేదు.
మెరుగైన చికిత్స అందించాలి - ఎన్‌ఎంయూఏ
కరోనా బారిన పడిన సిబ్బందికి మెరుగైన చికిత్స అందించేలా చూడాలని ఎన్‌ఎంయూఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో కోరారు.