దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకమని.. మృతుల కుటుంబ సభ్యులు కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. తమ కుమారులు పారిపోలేదని... పోలీసులే పట్టుకెళ్లి కాల్చి చంపారని కమిషన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సిర్పూర్కర్ కమిషన్ విచారణలో భాగంగా... మృతుల కుటుంబ సభ్యులు ఈరోజు కమిషన్ ఎదుట హాజరయ్యారు. బాధితుల వాంగ్మూలాన్ని కమిషన్ నమోదు చేసుకుంది. రేపు కూడా మృతుల కుటుంబ సభ్యుల నుంచి కమిషన్ సాక్ష్యం సేకరించనుంది.
2019 నవంబర్ 27వ తేదీన ఓ యువ వైద్యురాలిని నలుగురు యువకులు తొండుపల్లి టోల్గేట్ సమీపంలో హత్యాచారం చేశారు. ఆ తర్వాత షాద్నగర్ సమీపంలో జాతీయరహదారి వంతెన కింద పెట్రోల్ పోసి తగులబెట్టారు. కేసు నమోదు చేసుకున్న షాద్నగర్ పోలీసులు ఆరిఫ్, చెన్నకేశవులు, నవీన్, శివలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దర్యాప్తులో భాగంగా కస్టడీలోకి తీసుకున్న షాద్నగర్ పోలీసులు... 2019 డిసెంబర్ 6వ తేదీన సీన్ రికన్స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలానికి నిందితులను తీసుకెళ్లారు. ఆ సమయంలో నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు.... పోలీసుల వద్ద ఉన్న రెండు తుపాకులు లాక్కొని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయారు.