సినిమా.. ప్రేక్షకుడికి సంస్కారాన్ని నేర్పించాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. వినోదాన్ని అందించడంతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించాలన్నారు. సిరివెన్నెల జయంతి సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో తానా ప్రపంచ వేదిక, సిరివెన్నెల కుటుంబసభ్యులు నిర్వహించిన సిరివెన్నెల సమగ్ర సాహిత్య పుస్తకావిష్కరణ సభకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తానా ప్రపంచ వేదిక రూపొందించిన సిరివెన్నెల సమగ్ర సాహిత్య పుస్తకంలోని మొదటి సంపుటిని లాంఛనంగా ఆవిష్కరించి సీతారామశాస్త్రి సతీమణికి అందజేశారు. అనంతరం సిరివెన్నెలతో తనకున్న అనుబంధాన్ని వెంకయ్యనాయుడు గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా ఇటీవల వస్తున్న సినిమాల తీరుపై సున్నితంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
"సిరివెన్నెల సినిమా కవి కాదు.. నిశ్శబ్ధ పాటల విప్లవం. సిరివెన్నెలతో గడిపిన క్షణాలు ఎంతో విలువైనవి. సిరివెన్నెలతో నాకు చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. సిరివెన్నెల గురువు సత్యరావు మా స్నేహితుడు. సిరివెన్నెల సమగ్ర సాహిత్య పుస్తకావిష్కరణ ఆనందంగా ఉంది. నేను పాటల పుస్తకం ఆవిష్కరించడంపై కొందరిలో ఆశ్చర్యం. పాటను అర్థవంతంగా కొలవడంలో సిరివెన్నెల అగ్రగణ్యులు. మనిషికి సంగీతం, సాహిత్యం సాంత్వన కలిగిస్తుంది. సినిమాల రాకతో సంగీతం, సాహిత్యానికి మంచి రోజులు వచ్చాయి. ప్రజలను అత్యంత ప్రభావితం చేసే మాధ్యమం సినిమా రంగం. మన ఆలోచనలను పెంచుకోవాలి, ఇతరులతో పంచుకోవాలి. సిరివెన్నెల ప్రతి పాటలో.. మాటలో సందేశం ఉంటుంది. నేను అన్నమాచార్య కీర్తనలు, సిరివెన్నెల పాటలు వింటాను. సినిమాల తీరును చిత్ర పరిశ్రమ సరిద్దిదుకోవాలి. సిరివెన్నెల లాంటి మహానీయుడి స్ఫూర్తితో మాతృభాషా ప్రేమికులం కావాలి."- వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి