రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9,618 గ్రూపు-4 పోస్టులను ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనల దస్త్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదానికి పంపినట్లు తెలుస్తోంది. గ్రూపు-4 కింద భర్తీ చేయనున్న వాటిలో జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనోలు, టైపిస్టులు, అకౌంటెంట్లు తదితర ఉద్యోగాలున్నాయి. అన్ని జిల్లాల్లో, శాఖాధిపతుల కార్యాలయాల్లో కిందిస్థాయిలోని ఈ పోస్టులు చాలా ఖాళీగా ఉండడం వల్ల పరిపాలన పరమైన సమస్యలు ఏర్పడుతున్నందున వీటిని త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం నిర్ణయం మేరకు నోటిఫికేషన్‌పై తుది నిర్ణయం తీసుకునే వీలుంది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గ్రూపు-4 పోస్టుల భర్తీపై ఇటీవల సమీక్ష నిర్వహించారు. దీర్ఘకాలం తర్వాత గ్రూపు-1 పోస్టులు భర్తీ అవుతున్నందున వాటికి సంబంధించిన విద్యార్హతలు, ఇతర అంశాలపై చర్చించారు. దీనికి సంబంధించి పబ్లిక్ సర్వీసు కమిషన్‌తో పాటు ఇతర నియామక సంస్థల నుంచి సలహాలు తీసుకున్నారు. అన్నింటిని క్రోడీకరించి దస్త్రంగా రూపొందించి సీఎం ఆమోదానికి పంపించారు.