తెలంగాణ

telangana

ETV Bharat / city

singareni: భూ సేకరణకు సహకరించాలని ఒడిశా అధికారులను కోరిన సింగరేణి బృందం - తెలంగాణ తాజా వార్తలు

సింగరేణి ఉన్నతాధికారులు బృందం రెండు రోజులపాటు ఒడిశా రాష్ట్రంలో పర్యటించింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా కేటాయించిన బొగ్గు బ్లాకుకు సంబంధించిన భూసేకరణకు సహకరించాలని సింగరేణి అధికారుల బృందం ఒడిశా ఉన్నతాధికారులను కోరింది.

singareni
singareni

By

Published : Aug 24, 2021, 10:46 PM IST

రెండు రోజుల పాటు ఒడిశాలో పర్యటించిన సింగరేణి బృందం.. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన న్యూ పాత్రపద బొగ్గు బ్లాకుకు సంబంధించిన భూసేకరణకు సహకరించాలని ఒడిశా ఉన్నతాధికారులను కోరింది. ఈ పర్యటనలో ఒడిశా రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ బిష్ణు పాదసేథి, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు సీసీఆర్ కుమార్‌ రాథోను కలిసి విన్నవించారు. సింగరేణి రెండో దశకు సంబంధించిన అనుమతులను వీలైనంత త్వరగా మంజూరు చేయాలని సింగరేణి బృందం విజ్ఞప్తి చేసింది. ఇందుకు ఒడిశా ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించినట్లు సింగరేణి అధికారులు పేర్కొన్నారు. మరో 4 నెలల్లో నైనీ బొగ్గు బ్లాకు నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కానున్నందున రైలు మార్గం ద్వారా రవాణా చేయడానికి గల అవకాశాలను పరిశీలించారు. అక్కడి రైల్వే అధికారులతో బొగ్గు రవాణాపై చర్చించారు.

నైనీ బ్లాకుకు అనుబంధంగా అంగూల్ జిల్లా కేంద్రానికి సమీపంలో సింగరేణి సంస్థ రూ.2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన బొగ్గు విశ్లేషణ కేంద్రాన్ని సింగరేణి ఫైనాన్స్‌ విభాగం డైరెక్టర్ బలరామ్‌ ప్రారంభించారు. ఈ కేంద్రంలో అత్యాధునిక బొగ్గు విశ్లేషణా యంత్రాలను కంపెనీ ఏర్పాటు చేసిందని అధికారులు తెలిపారు. సింగరేణి నైనీ బొగ్గుతోపాటు ఇతర బొగ్గు ఉత్పత్తి సంస్థలకూ సేవలందించేందుకు వీలుగా ఈ లేబొరేటరీని తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు లాబోరేటరీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ పర్యటనలో బలరామ్‌తోపాటు అడ్వైజర్​ మైనింగ్ డీఎన్ ప్రసాద్‌, జె ఆల్వీన్‌, విజయరావు, సురేశ్​ ఉన్నారు.

బొగ్గు విశ్లేషణ కేంద్రం

నైనీ ప్రాజెక్టుకు గతంలో తొలిదశ అనుమతులు

ఒడిశాలోని అంగూల్ అటవీ డివిజన్ ప్రాంతంలోని ఛెండిపాద, కంకురుపాల్లో ఉన్న 643.095 హెక్టార్ల రిజర్వ్​డ్ ఫారెస్టు భూమి, 140.18 హెక్టార్ల గ్రామ అటవీ స్థలాన్ని నైనీ ప్రాజెక్టుకు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం లభించినట్లయిందని సింగరేణి సీఎండీ వివరించారు. తాజాగా తొలి దశ అనుమతులు లభించడంతో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభానికి మార్గం సుగమం అయిందన్నారు.

'2014లో సింగరేణికి నైనీ ప్రాజెక్టు'

సింగరేణికి 2014లో ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌ను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని సింగరేణి సీఎండీ తెలిపారు. నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని.. ఇది సంస్థకు లాభసాటిగా ఉంటుందన్నారు. ఇక్కడ తక్కువ ఖర్చుతోనే బొగ్గు బయటకు తీయడానికి అనుకూల పరిస్థితులున్నాయన్నారు.

తక్కువ ఖర్చుతో ఉత్పత్తి..

ప్రస్తుతం సింగరేణిలో ఉన్న గనులన్నీ లోతైన ప్రాంతంలో ఉన్నాయి. 6 నుంచి 10 క్యూబిక్‌ మీటర్ల మట్టిని తొలగిస్తేనే టన్ను బొగ్గును వెలికితీసే అవకాశం ఉంది. నైనీలో మాత్రం అతి తక్కువ లోతుల్లో నిక్షేపాలు గుర్తించారు. పైపొరల్లోనే బొగ్గు ఉన్నట్లు ప్రాథమిక అన్వేషణలో తేలింది. 2 నుంచి 3 క్యూబిక్‌ మీటర్ల మట్టిని మాత్రమే తీయాల్సి ఉంటుంది. దీంతో మట్టి తొలగించే ఖర్చు భారీగా తగ్గుతుంది. టన్ను బొగ్గు ఉత్పత్తికి ఇక్కడైతే రూ.2400 ఖర్చు అవుతుంది. అదే అక్కడైతే రూ.800 అవుతుందని అంచనా వేస్తోంది. అదేవిధంగా నాణ్యమైన ఖనిజం లభించే అవకాశం ఉండటంతో అక్కడి నైనీ ఉపరితల గని లాభసాటిగా ఉంటుందని సింగరేణి భావిస్తోంది.

ఇదీ చూడండి:SINGARENI: 'నైనీ ప్రాజెక్టు'కు అటవీశాఖ నుంచి తొలిదశ అనుమతులు

ABOUT THE AUTHOR

...view details