తెలంగాణ

telangana

ETV Bharat / city

Singareni: సింగరేణి విశ్రాంత ఉద్యోగుల దైన్య జీవనం.. పింఛన్​ రూ.300 నుంచి రూ.500లే!

కోల్‌ ఇండియాతో పాటు సింగరేణిలో పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు, ఉద్యోగులందరూ నామాత్రంగానే పింఛన్లు అందుకుంటున్నారు. ఇందులోనూ 2000 సంవత్సరానికంటే ముందు రిటైరయినవారిలో సింహభాగం మరీ హీనంగా రూ.300- 500తో సర్దుకుంటున్నారు. ఇంత స్వల్ప మొత్తంతో జీవనం సాధ్యమేనా.. అన్నది అధికారులూ ఆలోచించటంలేదు.

pension
పింఛన్​

By

Published : Aug 14, 2021, 8:35 AM IST

కోల్‌ ఇండియా ఛైర్మన్‌గా ఒక అధికారి 1994లో పదవీవిరమణ చేశారు. అప్పట్లో ఆయనకు రూ.2,440లు పింఛనుగా నిర్ధరించారు. నేటికీ నెలనెలా ఆయన అదే మొత్తాన్ని అందుకుంటున్నారు! దానికి సమానమైన హోదాలో పనిచేసిన ఐఏఎస్‌ అధికారికైతే సగటున లక్షన్నర వరకూ పెన్షన్‌ అందుతుంది. కోల్‌మైన్స్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ పెన్షన్‌ స్కీం అమలవుతున్న తీరుకు మచ్చుకు ఇదో ఉదాహరణ. అధికారుల పరిస్థితే ఇలా ఉంటే.. ఉద్యోగులూ, కార్మికుల తీరు మరింత దయనీయం.

కోల్‌ ఇండియాతో పాటు సింగరేణిలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులందరికీ కోల్‌మైన్స్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ పింఛను స్కీం-1998 వర్తిస్తుంది. ఈ మేరకు పదవీవిరమణ రోజున నిర్ధరించిన పింఛను మొత్తాన్నే జీవితాంతం వాళ్లు అందుకుంటారు. డీఏ పెంపు ఉన్నా దాని ప్రభావమేమీ పెన్షనుపై ఉండదు. ఒక్క సింగరేణిలోనే దాదాపు 20వేల మంది విశ్రాంత ఉద్యోగులు రూ.వెయ్యి కంటే తక్కువ పింఛను అందుకుంటున్నారు. ఇందులోనూ 2000 సంవత్సరానికంటే ముందు రిటైరయినవారిలో సింహభాగం మరీ హీనంగా రూ.300- 500తో సర్దుకుంటున్నారు. ఇంత స్వల్ప మొత్తంతో జీవనం సాధ్యమేనా.. అన్నది అధికారులూ ఆలోచించటంలేదు. గత 23 ఏళ్లుగా దీనిని సవరించనే లేదు. ప్రతి మూడేళ్లకు దీన్ని సమీక్షించాలన్న నిబంధన ఉన్నా ట్రస్టీల బోర్డు పట్టించుకున్నదీ లేదు. ఈ బోర్డుకు బొగ్గుమంత్రిత్వశాఖ కార్యదర్శి అధ్యక్షత వహిస్తారు.

నిర్ణయించేది ఎలా..?

ఉద్యోగి మూలవేతనం, డీఏ కలిపి పది నెలల్లో ఎంతవుతుందో, అందులో 25 శాతాన్ని పింఛనుగా నిర్ణయిస్తారు. అదే మొత్తం నెలవారీగా అందజేస్తారు. ఒకవేళ ఉద్యోగి చనిపోతే, జీవిత భాగస్వామికి 60శాతం మొత్తాన్ని అందజేస్తున్నారు. 2007లో అధికారులకు, 2011లో కార్మికులకు వేతనాలు పెరగటంతో పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చినా పాతవారి పరిస్థితి దయనీయంగానే ఉంది. బాధితులు ధన్‌బాద్‌లోని కోల్‌ ఇండియా సీఎంపీఎఫ్‌ ప్రధాన కార్యాలయానికి వెళ్లి గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో చిన్నచిన్న అవసరాలకూ పిల్లలపై ఆధారపడవలసి వస్తోందని చాలామంది కార్మికులు ఆవేదన చెందుతున్నారు. కొందరయితే ఈ పింఛనును కాదనుకుని రాష్ట్ర ప్రభుత్వం అందించే వృద్ధాప్య, వితంతు పెన్షన్లపైన ఆధారపడుతోండటం వారి దైన్యతకు అద్దం పడుతుంది.

న్యాయపోరాటం చేస్తున్నాం

ప్రస్తుతం అందజేస్తున్న పింఛను అవసరాలకు ఏమాత్రం సరిపోదు. ఎన్ని వినతులు సమర్పించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే సింగరేణి రిటైర్డు ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ తరఫున సుప్రీంకోర్టులో రిట్‌ వేశాం. దీనిని దిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. ఆరేళ్లుగా కేసు కొనసాగుతుంది. ఈ నెల 27న తదుపరి విచారణ ఉంది. పింఛను స్కీంను సవరించాలని, ప్రస్తుతం అదే గ్రేడులో పనిచేసే వ్యక్తికి లభించే పింఛనులో 50శాతం చెల్లించాలని కోరుతున్నాం.

- దత్తాత్రేయుడు, రిటైర్డ్‌ డైరెక్టర్‌, సింగరేణి, హైదరాబాద్‌

చాలీచాలని వేతనంతో బతకులీడుస్తున్నాం

పదవీవిరమణ చేయగానే చేతికందే గ్రాట్యుటీ, ఇతర డబ్బులు పిల్లల పెళ్లిళ్లకని, చదువులకని చేసే అప్పు తీర్చటానికే సరిపోతోంది. ఆ తర్వాత నెలనెలా వచ్చే పెన్షనే గతి. అరకొర డబ్బులతో బతకటం చాలా కష్టంగా ఉంది. 30 నుంచి 40 ఏళ్ల పాటు రెక్కలుముక్కలు చేసుకుని బొగ్గుగనుల్లో చెమటోడ్చిన కార్మికుల జీవితం దుర్భరంగా మారింది.

- దండంరాజు రామచంద్రరావు, రిటైర్డ్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌, రామగుండం

ఇదీ చదవండి:Double Bedroom Scheme : నిరుపేదల 'డబుల్' కల.. ఇప్పట్లో తీరేనా?

ABOUT THE AUTHOR

...view details