తెలంగాణ

telangana

ETV Bharat / city

కొవిడ్ బాధితులకు అండగా.. సింగరేణి - singareni helps covid victims

కరోనా ఉద్ధృతి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పరిశ్రమలతోపాటు వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులు అవస్థల పాలవుతున్నారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో సింగరేణి యాజమాన్యం.. అందులో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు అండగా నిలుస్తోంది. కొవిడ్‌ బారిన పడిన బాధితులకు వివిధ రకాల సదుపాయాలు కల్పించి సాంత్వన చేకూరుస్తోంది. వీరి కోసం సంస్థ సీఎండీ శ్రీధర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

singareni, singareni  helps covid patients
సింగరేణి, కొవిడ్ బాధితులకు సింగరేణి సాయం, తెలంగాణ సింగరేణి

By

Published : May 16, 2021, 8:09 AM IST

కరోనా బారిన పడిన వారికి సింగరేణి అండగా నిలుస్తోంది. వివిధ రకాల సదుపాయాలు కల్పించి చేయూతనందిస్తోంది. సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి రూ.3.16 కోట్లతో 1,25,250 ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్లను కొనుగోలు చేసింది. వీటితో 99,406 మందికి పరీక్షలు నిర్వహించింది. ఇప్పటి వరకు 27 వేల మంది సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ఒప్పంద కార్మికులకు టీకాలు వేసింది. మరో 50 వేల మందికి టీకాలు వేసేందుకు ప్రణాళిక రూపొందించింది.

కరోనా రోగుల చికిత్సకు రూ.43 లక్షలతో సింగరేణి ఆసుపత్రుల్లో 1,400 పడకలతో ప్రత్యేక వార్డులు ప్రారంభించింది. రూ.18 లక్షలతో ఆక్సీమీటర్లు, అవసరమైన వస్తువులు, రూ.5.50 కోట్లతో రెమ్‌డెసివిర్‌, ఫెవిపెరావిల్‌ తదితర మందులను కొనుగోలు చేసింది. పౌష్టికాహారానికి రూ.1.50 కోట్లు వెచ్చించింది. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రుల్లో 42 మందికి చికిత్స అందిస్తోంది. మహమ్మారితో మరణించిన 39 మంది ఉద్యోగుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. వ్యాధిసోకిన ఉద్యోగులకు 14 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేస్తోంది. విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, సిబ్బందికి నగదు ప్రోత్సాహకాలను అందిస్తోంది.

ఒప్పంద ఉద్యోగులకు ఉచిత వైద్యసేవలు

కరోనా బారిన పడిన సింగరేణి ఒప్పంద ఉద్యోగులకు కంపెనీ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యసేవలు అందించాలని ఆ సంస్థ డైరెక్టర్‌ బలరాం సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ నుంచి ఆయన అన్ని ఏరియాల డైరెక్టర్లతో మాట్లాడి కొవిడ్‌ కట్టడిపై సమీక్షించారు. సింగరేణిలో అదనంగా వైద్య నిపుణుల నియామకానికి సీఎండీ అనుమతించారని వివరించారు. వ్యాధి లక్షణాలున్న వారు చికిత్స చేయించుకోవడానికి వెనకాడవద్దని మరో డైరెక్టర్‌ సత్యనారాయణరావు పేర్కొన్నారు. వ్యాధిపై ఏమైనా సందేహాలుంటే కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ దృష్టికి తేవాలని జీఎం సూర్యనారాయణరావు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details