దేశంలోని థర్మల్ విద్యుత్‌లో కేంద్రాల్లో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం మెరుగైన ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌తో 2021-22లో మొదటి స్థానంలో నిలవడంపై ఆ సంస్థ సీఎండీ శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. మంచి దార్శనికతతో ప్రస్తుత స్థాయి నుంచి మరింత ఎదగడానికి లక్ష్యాలను నిర్థేశించుకుని ముందుకు సాగాలని ఉద్యోగులకు సూచించారు. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో సింగరేణి థర్మల్, సోలార్ ప్లాంట్ల పనితీరుపై సీఎండీ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ర్యాంకింగ్లో రాష్ట్రంలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అన్నింటికన్నా ఏప్రిల్ నుంచి డిసెంబర్ నాటికి సగటున 87.18శాతం పీఎల్‌ఎఫ్ సాధించి ప్రథమ స్థానంలో నిలిచిందని... తెలంగాణ స్టేట్ జెన్ కో 73.98శాతం పీఎల్‌ఎఫ్‌తో రెండో స్థానంలో నిలిచిందని శ్రీధర్ వివరించారు. ఆ తర్వాత 70.29 శాతం పీఎల్‌ఎఫ్‌తో బంగాల్ పవర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మూడో స్థానంలో ఉండగా.. 68.10 శాతంతో చత్తీస్‌గఢ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నాలుగో స్థానంలో, 63.95 శాతంతో ఒడిశా పవర్ జనరేషన్ కార్పోరేషన్ ఐదో స్థానంలో, 58.83 శాతంతో ఆంధ్రప్రదేశ్ జెన్ కో ఆరో స్థానంలో నిలిచిందని తెలిపారు.