Singareni Budget Expenditure 2021-22 : సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ పూర్తిగా ఖర్చుకాలేదని పార్లమెంటరీ స్థాయీసంఘం పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దీనికి రూ.2,300 కోట్లు కేటాయించగా ఖర్చయింది రూ.1,310 (57%) కోట్లేనంది. 2021-22 బడ్జెట్‌లో రూ.2,500 కోట్లు కేటాయించినా అంచనాలు సవరించేటప్పటికి దాన్ని రూ.2వేల కోట్లకు కుదించినట్లు తెలిపింది. అందులోనూ 2022 జనవరి వరకు కేవలం రూ.1,531.88 (76.6%) ఖర్చయినట్లు పేర్కొంది. 2022-23 బడ్జెట్‌లో సింగరేణికి రూ.2వేల కోట్లే కేటాయించినట్లు గుర్తుచేసింది.
Singareni Budget 2021-22 : 2021-22లో సింగరేణికి 68 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించగా 52.54 లక్షల టన్నుల(77%)కు మాత్రమే చేరుకున్నట్లు స్థాయీసంఘం పేర్కొంది. 2022-23లో 72 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించినట్లు వెల్లడించింది. 2021-22లో సింగరేణికి కేటాయించిన బడ్జెట్ పూర్తిగా ఖర్చుకాకపోవడానికి కారణం రూ.150కోట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్ట్ పనులు నిలిచిపోవడమేనని బొగ్గుశాఖ తెలిపినట్లు స్థాయీసంఘం తెలిపింది. కొవిడ్ తర్వాత కాంట్రాక్టర్ దాని పనులు చేపట్టలేకపోయారని, వాటిని 2022-23లో పూర్తిచేస్తామని చెప్పారని తెలిపింది.
భారీ బకాయిలు
Telangana in Parliament : సింగరేణికి వివిధ రాష్ట్రాల విద్యుదుత్పత్తి సంస్థలు భారీ మొత్తంలో బకాయి పడినట్లు స్థాయీసంఘం తెలిపింది. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థల నుంచి 2019లో రూ.1,944 కోట్లు, 2020లో రూ.3,320 కోట్లు, 2021లో రూ.2,693 కోట్లు, 2022లో జనవరి 31 వరకు రూ.5,620 కోట్ల బకాయిలు ఉన్నట్లు పేర్కొంది.
భారీగా డిస్కంల బకాయిలు
Parliament Budget Sessions 2022 : విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు ఏపీలోని డిస్కంలు రూ. 7,538 కోట్లు, తెలంగాణ డిస్కంలు రూ. 6,889 కోట్ల మేర బకాయి పడినట్లు కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్‌కే సింగ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని డిస్కంల నుంచి ఉత్పత్తి సంస్థలకు రూ. 1,00,931 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నట్లు చెప్పారు. మంగళవారం రాజ్యసభలో భాజపా సభ్యుడు టీజీ వెంకటేష్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. తెలంగాణ డిస్కంల నుంచి రూ. 6,111.88 కోట్లు రావాల్సి ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం తమ దృష్టికి తీసుకొచ్చిందని చెప్పారు. దీనిపై ఆ రెండు రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశామని వెల్లడించారు. తెలంగాణ నుంచి బకాయిలు రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో కేసు దాఖలు చేసిందని, దీంతో ఇప్పుడది కోర్టు పరిధిలోని అంశంగా మారిందని ఆర్‌కే సింగ్ చెప్పారు.