తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రముఖ కవి సింగమనేని నారాయణ కన్నుమూత

ఏపీలోని అనంతరం జిల్లాకు చెందిన ప్రముఖ అభ్యుదయ రచయిత, విమర్శకుడు సింగమనేని నారాయణ కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. గత పది రోజుల నుంచి మృత్యువుతో పోరాడి గురువారం మధ్యాహ్నం 12.30కు తుదిశ్వాస విడిచారు.

singamaneni narayana
సింగమనేని నారాయణ

By

Published : Feb 26, 2021, 2:37 PM IST

ప్రముఖ అభ్యుదయ రచయిత, విమర్శకుడు సింగమనేని నారాయణ కన్నుమూశారు. ఐదు నెలలుగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల 15న ఏపీలో అనంతపురంలోని తన నివాసంలో కళ్లు తిరిగి పడిపోయారు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే పరిస్థితి విషమించింది. ఆయన శరీరం చికిత్సకు స్పందించకపోవడంతో వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు.

పది రోజులు మృత్యువుతో పోరాడి గురువారం మధ్యాహ్నం 12.30కు తుదిశ్వాస విడిచారు. సింగమనేని మృతి పట్ల పలువురు సాహితీవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని మరూరు బండమీదపల్లిలో 1943 జూన్‌ 26న రైతు కుటుంబంలో సంజీవమ్మ, రామప్ప దంపతులకు నారాయణ జన్మించారు. పీయూసీ వరకు అనంతపురంలో చదువుకున్నారు. తిరుపతి ఓరియంటల్‌ కళాశాలలో విద్వాన్‌ పూర్తిచేశారు. తర్వాత 32 సంవత్సరాలు అనంతపురం జిల్లాలోని వివిధ ఉన్నత పాఠశాలల్లో తెలుగు పండితుడిగా పనిచేశారు.

బాల్యం నుంచే...

సింగమనేని నారాయణ బాల్యం నుంచే మంచి చదువరి. రచనా రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. 17వ ఏట తిరుపతిలో ఆయన చేతికి శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం దొరికింది. ఆయన మహాప్రస్థానాన్ని చదవలేదు... కంఠస్థం చేశారని చెబుతారు దగ్గరగా చూసిన సాహితీకారులు. 1960లో తన మొదటి కథ ‘న్యాయం ఎక్కడ?’ రచించారు. 19 ఏళ్ల వయసులో ‘ఆదర్శాలు-అనుబంధాలు’, ‘అనురాగానికి హద్దులు’, ‘ఎడారి గులాబీ’ నవలలు రాశారు. తర్వాతి కాలంలో కాల్పనిక రచనల వల్ల సమాజానికి ఒనగూరేదేమీ లేదని గ్రహించి తార్కిక రచనలకు శ్రీకారం చుట్టారు.

ఈ క్రమంలోనే జూదం, సింగమనేని కథలు, నీకు నాకు మధ్య నిశీధి, సీమ కథలు, అనంతం, ఇనుపగజ్జెల తల్లి వంటి రచనలు చేశారు. ‘నా సాహిత్య శిల్పాన్ని ప్రభావితం చేసింది కొడవటిగంటి కుటుంబరావు, నా మానసిక దృక్పథాన్ని మార్చింది శ్రీశ్రీ’ అని సింగమనేని చెప్పేవారు. అభ్యుదయాన్ని, శ్రీశ్రీ రచనలను ఆయనలా అర్థం చేసుకున్నవారు మరొకరు లేరు. తొలుత శ్రీశ్రీ మాదిరిగానే ప్రేమ నవలలు రాసినా... తర్వాత సంపూర్ణ మార్క్సిస్టుగా మారి ఆ భావజాలంతో రచనల్ని కొనసాగించారు. రాయలసీమ రచయితల కథలను సంకలనం చేయడంలో వీరి కృషి ప్రత్యేకమైనది.

విలక్షణం...

సింగమనేని నారాయణను తెలుగుసాహిత్యంలో విలక్షణ రచయితగానే కాక గొప్ప పాఠకుడిగానూ సాహితీవేత్తలు అభివర్ణిస్తారు. సింగమనేని కథల్లో రైతు కష్టాలు, విద్యావ్యవస్థ, మధ్యతరగతి కుటుంబాల జీవనశైలి ప్రధాన వస్తువులు. సాహిత్యానికి వాస్తవికతను పరిచయం చేశారు. సాహితీ రంగంలో సింగమనేని చేసిన కృషికి 1997లో ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం వారు ‘అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ పురస్కారం’తో సత్కరించారు.

తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాహితీ పురస్కారం, రాచకొండ రచనా పురస్కారం, పురిపండ అప్పలస్వామి పురస్కారాలను పొందారు. 2017లో ఏపీ ప్రభుత్వం కళారత్న పురస్కారంతో సత్కరించింది. నారాయణకు భార్య గోవిందమ్మ, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. కుమారుడు వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. ఇద్దరు కుమార్తెలు ఉపాధ్యాయినులుగా పనిచేస్తున్నారు. మరో కుమార్తె గృహిణి. పెద్ద అల్లుడు రామాంజనేయులు మహర్షి కలం పేరిట రచనలు చేస్తున్నారు.

ఇదీ చదవండి:'భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్యపై అసత్యాలు'

ABOUT THE AUTHOR

...view details