తెలంగాణ

telangana

ETV Bharat / city

చేతులు మారిన జాగీర్, భూదాన్ భూములు.. చర్యలకు 'సిన్హా' సిఫార్సు - జాగీర్, భూదాన్ భూముల కబ్జాదారులపై చర్యలకు శ్యాం కుమార్ సిన్హా కమిటీ సిఫార్సు

రాజధాని హైదరాబాద్‌ చుట్టూ ఏళ్ల క్రితం చోటుచేసుకున్న భూ ఆక్రమణల్లో అక్రమాలను, అధికారుల ఉదాసీనతలను శ్యాం కుమార్‌ సిన్హా కమిటీ ఐదేళ్ల క్రితమే బయటపెట్టింది. ఇందుకు బాధ్యులైన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అక్రమాల గుట్టు వెల్లడించి... ఇలాంటివి భవిష్యత్తులో చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలను పేర్కొంటూ ప్రభుత్వానికి 11 నివేదికలను సమర్పించింది. ఇప్పటికీ ఎటువంటి చర్యలు లేవు. తాజాగా అక్కడక్కడా ఆక్రమణలు కొనసాగుతుండటంతో సిన్హా కమిటీ నివేదికపై మరోసారి చర్చ జరుగుతోంది.

shyam kumar sinha recommend to actions on jageer and bhudaan land grabbers
చేతులు మారిన జాగీర్, భూదాన్ భూములు.. చర్యలకు 'సిన్హా' సిఫార్సు

By

Published : Jan 18, 2021, 6:24 AM IST

చేతులు మారిన జాగీర్, భూదాన్ భూములు.. చర్యలకు 'సిన్హా' సిఫార్సు

ఉమ్మడి రాష్ట్రంలో 2014 సంవత్సరానికి ముందు ప్రభుత్వ భూముల్లో చోటు చేసుకున్న అక్రమాలపై తెరాస ప్రభుత్వం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్యాం కుమార్‌ సిన్హా నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. 2015 జనవరి నుంచి 2016 జులై వరకు అధ్యయనం చేసిన ఈ కమిటీ రెవెన్యూశాఖ, రిజిస్ట్రేషన్ల శాఖలకు చెందిన ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి అధికారుల పాత్రలను తేల్చిచెప్పింది. నగరం చుట్టూ ఉన్న ఉమ్మడి రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని మండలాల్లో చోటుచేసుకున్న అక్రమాలను, పాల్పడిన వారు, సహకరించిన అధికారుల జాబితాను సైతం వెల్లడించింది.

నేతల కుమ్మక్కు

వేల కోట్ల విలువ చేసే అసైన్డ్‌, జాగీరు, చెరువుల భూములను అధికారులు, కొందరు రాజకీయ నాయకులు కుమ్మక్కై మాయం చేసేరని కమిటీ నిగ్గుతేల్చింది. ఆక్రమణలను నిలువరించాల్సిన యంత్రాంగం పట్టించుకోలేదు సరికదా వారికే వంతపాడింది. భూములను ఇష్టారీతిన పంచారంటూ... పలు సంఘటనలను శ్యాం కుమార్‌ సిన్హా తన నివేదికల్లో పొందుపర్చారు. దాదాపు 715 ఎకరాలు అక్రమార్కుల పాలయినట్లు తేల్చారు.

నిబంధనలు తుంగలో..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం సైదాబాద్‌ కంచె పరిధిలో 114 ఎకరాల భూదాన్‌ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా టైటిల్‌ డీడ్‌ జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం బాటసింగారంలో భూదాన్‌ భూమి కాకపోయినా 16 ఎకరాల భూమిని భూదాన్‌ కరీస్‌ ఖాతాగా పేర్కొంటూ 2008లో పనిచేసిన తహసీల్దారు నిబంధనలు ఉల్లంఘించి మ్యుటేషన్‌ చేశారు. తుర్కయాంజల్‌లో పది ఎకరాల భూమికి నిరభ్యంతర పత్రం జారీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది.

విచారణకు సిఫార్సు..

మెదక్‌ జిల్లా తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, కొల్లూరు, పటాన్‌చెరులలో భూ వ్యవహారాల్లో కోర్టులో ఉన్న వ్యాజ్యాలపై జిల్లా యంత్రాంగం సీసీఎల్‌ఏను పరిగణనలోకి తీసుకోకుండానే అప్పీళ్లు చేసింది. భూ వ్యవహారాల్లో సీసీఎల్‌ఏ పాత్రను గుర్తించి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రభుత్వం పరిపాలన విధానాన్ని తీసుకొచ్చి రెవెన్యూ అధికారులు రెండేళ్ల కంటే ఎక్కువ కాలం ఒకేచోట పనిచేయకుండా పోస్టింగులు ఇవ్వాలని సిఫార్సు చేసింది. భూ అక్రమాలకు పాల్పడిన వారిపై సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. భూదాన్‌ బోర్డుకు చెందిన వారు చేసిన అక్రమాలపైనా సమగ్ర విచారణ చేయించాలని కోరింది.

ఇదీ చూడండి:కొవిడ్ ఎఫెక్ట్: రిజిస్ట్రేషన్ శాఖ లక్ష్యం చేరుకోవటం కష్టమే!

ABOUT THE AUTHOR

...view details