మగపిల్లాడు పుడితే అబ్బాయి పుట్టాడని సంబరపడతారంతే! అదే ఆడ కూతురు పుడితే.. మా ఇంట మహాలక్ష్మి పుట్టిందని గొప్పగా చెప్పుకొనే సంప్రదాయం మనది. ఈ సంస్కృతిని పాటించే ప్రతి ఇల్లూ లక్ష్మీ నివాసమే. క్షీరాబ్ది నుంచి జన్మించిన లక్ష్మికి సోదరుడు చంద్రుడు. తోబుట్టువులు కల్పతరువు, ఐరావతం, అమృతం. చంద్రుడు ప్రశాంతతను ఇస్తే.. కల్పతరువు కోర్కెలు నెరవేరుస్తుంది. ఐరావతం ఉన్నతస్థితిని సూచిస్తుంది. అమృతం.. చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తుంది. ఆడపిల్లను ఆదరించిన ఇంట ప్రశాంతత వెల్లివిరుస్తుంది. ఫలితంగా ఐశ్వర్యం కలుగుతుంది. ఉన్నతస్థితి సిద్ధిస్తుంది. మనఇంటి శ్రీలక్ష్మి మరో ఇంట అమ్మగా వారి వంశానికి చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తుంది. వరలక్ష్మీ వ్రత విధానంలో ఆధ్యాత్మిక విశేషం ఎలా ఉన్నా.. అదిచ్చే సందేశం మాత్రం ఆడపిల్లలను ఆదరించమని చెప్పడమే!!
మీ ఇంటిలో... వరలక్ష్మి మీరే! - shravana masam varalakshmi
శ్రావణ శోభకు నిండుదనం తెస్తుంది వరలక్ష్మీ వ్రతం. లక్ష్మీదేవి అనుగ్రహం కోరుతూ వ్రతం ఆచరించే స్త్రీమూర్తులు.. వాయనాలు అందుకుంటూ నిండు మనసుతో ఆశీర్వదించే ముత్తయిదువలు.. పట్టుపరికిణీల్లో మెరిసిపోయే యువతులు.. పండగంటే ఇదే అనిపిస్తుంది.
గుర్తుచేస్తేనే.. ఇప్పుడిప్పుడే ఆడపిల్లకు అవకాశాల్లో సగం కాకపోయినా.. కొంతైనా దక్కుతోంది. ఈ చిన్ని తోడ్పాటుకే ఆర్థిక స్వాతంత్రం పొందిన ఎందరో మహిళలు కుటుంబ పాలనలో కీలక పాత్ర పోషిస్తూ.. మహాలక్ష్ములుగా నిలుస్తున్నారు. అయితే, ఇంట్లో గోడపై ఉన్న చిత్తరువులో లక్ష్మీదేవి మోము చిరుదరహాసంతో శోభాయమానంగా ఉంటుంది. కన్నులు కాంతిపుంజాల్లా మెరిసిపోతుంటాయి. అక్షయమైన కాసులు కురిపిస్తూ బిడ్డలను కటాక్షిస్తుంటుంది అమ్మ! కానీ, అదే ఇంటి కోసం కష్టపడుతున్న ఇంటి లక్ష్ములు అందరూ అలా ఉంటున్నారా? అంటే సమాధానం లేదనే వస్తుంది. ఆర్థిక భారం పంచుకుంటున్న ఇంతికి.. ఇంటిపనుల్లో వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత ఇంటాయనదే అని ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిందే!
సాధికారతను చాటిచెప్పాలి.. వ్రతమేదైనా.. విధానం ఎలా ఉన్నా.. సనాతన వేడుకల సారాంశం సామాజిక స్పృహే! వరలక్ష్మీ వ్రతం దర్పాన్ని ప్రదర్శించడానికి చేసేది కాదు. స్త్రీ ఔన్నత్యాన్నీ, అవసరాన్నీ అందరికీ పరిచయం చేసే క్రతువు ఇది. వరలక్ష్మీ వత్రంలో చారుమతి కథ స్త్రీశక్తినీ, పాతివ్రత్యాన్ని వివరిస్తే.. ఈనాటి వరలక్ష్ముల కథలు మహిళా సాధికారతను, స్వావలంబనను చాటిచెప్పాలి. ఆనాడు చారుమతి లక్ష్మీ అనుగ్రహంతో సిరిసంపదలు పొందిందని చదవుకున్నాం. నేటి మహిళలకు.. అమ్మ అనుగ్రహంతో పాటు ఇంటిల్లిపాదీ అండదండలు అవసరం. అవి లభించిన నాడు.. మీ ఇంటిలో మీరే వరలక్ష్ములు అవుతారు. స్ఫూర్తిప్రదాతలుగా నిలుస్తారు. నవసమాజ నిర్మాతలుగా మారతారు.