Shortage of Competitive exam books : రాష్ట్రంలో 80 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని మార్చి 9న సీఎం కేసీఆర్ ప్రకటించగా.. 10 రోజుల్లోనే రూ.40లక్షల విలువైన పుస్తకాలు అమ్ముడైపోయాయి. అప్పటికే జనరల్ స్టడీస్, తెలంగాణ ఉద్యమ చర్రిత, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, భారత రాజ్యాంగం పుస్తకాలకు కొరత ఏర్పడింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పుస్తకం మాత్రం తర్వాత కొద్ది రోజుల్లోనే ముద్రించారు. గత 40 రోజులుగా డిమాండ్ ఉండటంతో పుస్తకాలు వేగంగా అమ్ముడయ్యాయి. ప్రస్తుతం భారతదేశ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ చరిత్ర-సంస్కృతి, తెలంగాణ ప్రాంతీయ భూగోళశాస్త్రం, పోటీ పరీక్షలకు పనికొచ్చే భారతదేశ చరిత్ర-సంస్కృతి తదితర కొన్ని పుస్తకాలే ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారని పలువురు అభ్యర్థులు ‘ఈనాడు’కు తెలిపారు. ఎంతో ఆశతో విక్రయ కేంద్రానికి వచ్చినా నిరాశ తప్పటం లేదని వారు ఆవేదన చెందారు. ఇంటర్ రెండో ఏడాది గణితం 2ఏ పుస్తకం కూడా లేదని ఓ విద్యార్థి తండ్రి తెలిపారు.
వీటికెంతో డిమాండ్..పోటీ పరీక్షల దృష్ట్యా ప్రత్యేకంగా దాదాపు 50 రకాల వరకు పుస్తకాలను అకాడమీ ముద్రిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఉద్యమం- రాష్ట్ర అవతరణ, తెలంగాణ ప్రాంతీయ భూగోళశాస్త్రం, ఆర్థికాభివృద్ధి-పర్యావరణం, తెలంగాణ చరిత్ర-సంస్కృతి, తెలంగాణ ఉద్యమ చర్రిత, జనరల్ స్టడీస్, భారత రాజ్యాంగం తదితర 20 రకాల పుస్తకాలకు మంచి డిమాండ్ ఉందని చెబుతున్నారు. గ్రూపు పరీక్షలకు సంబంధించి రూ.75 నుంచి గరిష్ఠంగా రూ.345 ధరతో పుస్తకాలు విక్రయిస్తున్నారు. అదే బయట మార్కెట్లో ప్రైవేట్ ప్రచురణ సంస్థలు ముద్రించిన పుస్తకాల ధరలు రూ.200ల నుంచి రూ.500 వరకు ఉన్నాయి.
కాగితం టెండర్‌పై కావాలనే నిర్లక్ష్యం..స్టాక్ లేని పుస్తకాల పునర్ముద్రణకు కాగితం లేదు. పోటీ పరీక్షల పుస్తకాలకు కాకున్నా ఇంటర్ పుస్తకాలను దృష్టిలో ఉంచుకొని కాగితాన్ని సిద్ధం చేసుకోవాల్సిన అకాడమీ ఈసారి తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినట్లు విమర్శలు వస్తున్నాయి. అకాడమీలో కిందిస్థాయి అధికారులు ప్రతిపాదనలు పంపినా, దస్త్రాలు సమర్పించినా ఓ కీలక అధికారి చూడకుండా పక్కన పెట్టినట్లు, వేగంగా నిర్లయం తీసుకోకుండా నాన్చినట్లు విమర్శలున్నాయి. చివరకు ఇటీవలే కాగితం టెండర్ ఖరారైంది. అది దక్కించుకున్న ఆ సంస్థ కాగితాన్ని సరఫరా చేసేందుకు మరో 10 రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. ఆపై పుస్తకాలను ముద్రించాలంటే మరో 10 రోజులు పడుతుంది. అంటే వచ్చే 20 రోజుల వరకు పుస్తకాలు స్టాక్ రాదన్న మాట. అదే విషయాన్ని విక్రయ సిబ్బంది కూడా చెబుతున్నారని నిరుద్యోగ అభ్యర్థులు తెలిపారు.