Sheep distribution scheme Cash transfer process started munugode: రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకం అమల్లో భాగంగా నగదు బదిలీకి ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలుత పైలెట్ ప్రాజెక్టు కింద నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం ఎంపిక చేసిన ప్రభుత్వం... ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ఎన్నికల వేళ... ఇప్పటికే నియోజకవర్గవ్యాప్తంగా సుమారు 5,800 మంది గొల్ల, కురుమల బ్యాంకు ఖాతాల్లో ఎన్నికల కోడ్ రాక ముందే నగదు బదిలీ ప్రక్రియ పూర్తైంది. గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తై సాయం కోసం ఎదురు చూస్తున్న ఒక్కో లబ్ధిదారుడు ఖాతాలో 1.58 లక్షల రూపాయలు చొప్పున మొత్తం 93.78 కోట్ల రూపాయలు నగదు బదిలీ అయ్యాయి.
సెప్టెంబర్ 30 అర్ధరాత్రి జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ కీలక నిర్ణయం తీసుకున్నప్పటికీ... పశుసంవర్థక శాఖ అధికారులు మూడు రోజులపాటు చాలా గోప్యంగా ఉంచారు. ఇంతలోనే సంబంధిత అకౌంట్లను ఫ్రీజ్ చేయాలని ఎంపీడీవోల ద్వారా బ్యాంకులకు ఉత్తరాలు వెళుతున్నాయి. 20 గొర్రెలు, ఒక విత్తనం పొట్టేలు యూనిట్ కొనుగోలు చేసి చూపితేనే బ్యాంకుల నుంచి లబ్ధిదారులు సొమ్ము ఉపసంహరించుకునేందుకు వెలుసుబాటు ఇవ్వాలని బ్యాంకర్లకు ఆదేశాలు వెళ్లడంతో... తాత్కాలికంగా ఉపసంహరణ నిలిపేశారు.