BRK Bhavan Covid Cases: సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బీఆర్కే భవన్లో కొవిడ్ కలకలం కొనసాగుతోంది. పలువురు సీనియర్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. ఐఏఎస్ అధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, శ్రీనివాసరాజుకు పాజిటివ్ నిర్ధరణ అయింది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పలువురికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దాదాపు పాతిక మంది వరకు కొవిడ్ బారిన పడ్డట్లు సమాచారం. పేషీల్లోని సిబ్బందికి పాజిటివ్ రావడంతో ఒకరిద్దరు అధికారులు హోంఐసోలేషన్లో ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు ఐఏఎస్ అధికారులతో పాటు కొందరు కొవిడ్ బారిన పడి కోలుకున్నారు.
గాంధీలో భారీగా
Gandhi Hospital Corona: వారం రోజులుగా పెద్ద సంఖ్యలోనే కొవిడ్ బారినపడుతున్నారు. ఇప్పటి వరకూ గాంధీ ఆసుపత్రిలో 40 మంది పీజీ వైద్యవిద్యార్థులు, 38 మంది హౌజ్‌సర్జన్లు, 35 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, ఆరుగురు అధ్యాపక సిబ్బంది మహమ్మారి బారిన పడగా ఉస్మానియాలో 71 మంది పీజీ వైద్యవిద్యార్థులతో పాటు 90 మంది సిబ్బంది, నిమ్స్‌లోనూ 70 మందికి పైగా వైద్యులు కరోనా కోరల్లో చిక్కుకున్నారు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో 9 మంది వైద్యసిబ్బందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. కొవిడ్ సేవల్లో పాల్గొంటున్న వైద్యసిబ్బందికి 7 రోజుల క్వారంటైన్ విధానాన్ని తిరిగి ప్రవేశపెడుతూ వైద్యశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియాలో పాజిటివ్ వచ్చిన వైద్య సిబ్బందికి గతంలో 15 రోజుల సెలవులు ఇవ్వగా.. ప్రస్తుతం వారానికి కుదిస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.బి.నాగేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.