తెలంగాణ

telangana

ETV Bharat / city

'రాత్రుళ్లు పొడిగించండి.. సైకిళ్లకు అనుమతివ్వండి'.. మెట్రోకు విజ్ఞప్తులు

హైదరాబాద్​ మెట్రోకు ప్రయాణికుల నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయి. రాత్రుళ్లు 10.15కు చివరి మెట్రో సర్వీస్​ ఉండగా.. దాన్ని పొడిగించాలంటూ కొందరు విజ్ఞప్తి చేస్తుంటే.. మెట్రో స్టేషన్లలో ఉంటే సైకిళ్లతో పాటు సొంత సైకిళ్లను అనుమతించాలంటూ మరికొందరు కోరుతున్నారు.

Several Appeals from Passenger on hyderabad metro services
Several Appeals from Passenger on hyderabad metro services

By

Published : Apr 13, 2022, 7:58 AM IST

వేసవి కాలం.. రంజాన్‌ సీజన్‌.. రాత్రిపూట నగరం ఎక్కువ సేపు మేల్కొని ఉంటుంది. పైగా విధులు ముగించుకుని అర్ధరాత్రి సమయానికి చాలామంది ఇంటికి చేరుకుంటారు. రాత్రి పది దాటితే మహానగరంలో ప్రజారవాణా నిలిచిపోతోంది. చివరి మెట్రో రైలు టర్మినల్‌ స్టేషన్ల నుంచి రాత్రి 10.15 తర్వాత లభించదు. ప్రయాణికుల కోరిక మేరకు, మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో ఉదయం 6 గంటలకే మెట్రో ప్రారంభించారు. కనీసం అర్ధరాత్రి 12 గంటల వరకైనా మెట్రో ప్రయాణం అందుబాటులో ఉంచాలని నగరవాసులు కోరుతున్నారు.

ఏసీ కావడంతో వేసవిలో మెట్రో రైళ్లలో ప్రయాణికులు పెరుగుతున్నారు. కారిడార్‌ 1 మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ మార్గంలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ ఉంటోంది. సగటున రోజూ 3 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. రద్దీ తక్కువగా ఉండే సెలవు రోజుల్లో ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా రూ.59తో రోజంతా ప్రయాణించే అవకాశాన్ని ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో తీసుకొచ్చింది. ఇంధన ధరలు, క్యాబ్‌ ఛార్జీలు పెరగడం కూడా ఈ ప్రజా రవాణా పెరగడానికి కారణమవుతోంది. రాత్రి 10.15 దాటితే అందుబాటులో లేకపోవడం తీవ్ర ఇబ్బందిగా మారింది.

సర్వీసులు తగ్గించైనా..:కారిడార్‌ 1, 3లో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక మెట్రో నడుస్తుంది. కొవిడ్‌కు ముందు ఐదు నిమిషాలకు ఒకటి నడిపేవారు. రద్దీకి అనుగుణంగా సర్వీసులు తగ్గిస్తున్నారు. ఇదే మాదిరి రాత్రి 10.15 తర్వాత పావుగంటకు ఒక సర్వీసైనా అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. చెన్నై, బెంగళూరుల్లో చివరి మెట్రో సర్వీసు రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. దిల్లీలోనూ కొన్ని మార్గాల్లో ఈ సమయం పాటిస్తున్నారు. బెంగళూరులో ఆఖర్లో 15 నిమిషాల వ్యవధిలో ఒక సర్వీసు నడుపుతున్నారు.

సైక్లింగ్‌ గ్రూపుల వినతులు ఇలా..: మెట్రో స్టేషన్‌ వరకు చేరుకునేందుకు, దిగిన తర్వాత గమ్యస్థానం చేరేందుకు ఆటోలు, క్యాబ్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. స్టేషన్లలో అందుబాటులో ఉండే సైకిళ్లతోపాటు సొంత సైకిళ్లను తమతో పాటు తీసుకెళ్లేందుకు అనుమతించాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ యాక్టివ్‌ మొబిలిటీ ఫౌండేషన్‌, సైక్లింగ్‌ కమ్యూనిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ గ్రూపులు మెట్రో రైలు సంస్థను అభ్యర్థించాయి. మడతపెట్టె సైకిళ్లకు మాత్రమే ప్రస్తుతం అనుమతి ఉంది.

  • ఫస్ట్‌ మైల్‌, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ కోసం మెట్రో స్టేషన్లలో బైస్కిల్‌ పార్కింగ్‌ సదుపాయం కల్పించాలి.
  • ప్రయాణికులు నిలబడేందుకు చోటు చాలదంటే హుక్స్‌ ఏర్పాటు చేయాలి.
  • పబ్లిక్‌ బైస్కిల్‌ షేరింగ్‌ ఏర్పాట్లు ఉండాలని బైస్కిల్‌ మేయర్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ శంతనా సెల్వన్‌ హెచ్‌ఎంఆర్‌ఎల్‌కు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details