తెలంగాణ

telangana

ETV Bharat / city

అంతరిక్షంలోకి బాలికల సత్తా.. అమృతోత్సవ వేళ కక్ష్యలోకి.. - రూపొందుతున్న ఆజాదీశాట్‌ ఉపగ్రహం

దేశంలోని 750 మంది విద్యార్థినుల ప్రతిభతో ‘ఆజాదీశాట్‌’ అనే ఉపగ్రహం తయారవుతోంది. దీనిని 75 ఏళ్ల స్వాతంత్య్ర అమృత మహోత్సవాలకు గుర్తుగా ఆగస్టు మొదటి వారంలో కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ సంస్థ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద రూ.58 లక్షలు సమకూర్చింది. చెన్నైలోని స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది.

అంతరిక్షంలోకి 'బాలికల ప్రతిభ'... ఆగస్టు మొదటి వారంలో కక్ష్యలోకి
అంతరిక్షంలోకి 'బాలికల ప్రతిభ'... ఆగస్టు మొదటి వారంలో కక్ష్యలోకి

By

Published : Jul 28, 2022, 11:50 AM IST

దేశంలోని 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థినుల భాగస్వామ్యంతో ‘ఆజాదీశాట్‌’ అనే ఉపగ్రహం రూపుదిద్దుకుంటోంది. దీనిని 75 ఏళ్ల స్వాతంత్య్ర అమృత మహోత్సవాలకు గుర్తుగా ఆగస్టు మొదటి వారంలో కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి పాఠశాలలో 8 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న 10 మంది బాలికలను నీతి ఆయోగ్‌ భాగస్వామ్యంతో ఎంపిక చేశారు. ‘అంతరిక్షంలో మహిళలు’ అనే ఐక్యరాజ్య సమితి థీమ్‌ నేపథ్యంలో ‘ఆల్‌ ఉమెన్‌ కాన్సెప్ట్‌’తో దీన్ని రూపొందిస్తున్నారు. 8 కిలోల బరువున్న ఉపగ్రహం సమాచార సేవలందించనుంది.

ఆజాదీశాట్‌ తయారీలో నారాయణవనం జడ్పీ ఉన్నత పాఠశాల (తిరుపతి జిల్లా), సెయింట్‌ ఫ్రాన్సిస్‌ బాలికల పాఠశాల(సికింద్రాబాద్‌), గురజాగుంట(తెలంగాణ), జేసీ ఎర్రుపాలెం టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ (తెలంగాణ), ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ స్కూల్‌, కురుగుంట (అనంతపురం), డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులం వీరలంకపల్లి(ఆంధ్రప్రదేశ్‌), జడ్పీ ఉన్నత పాఠశాల, జి.ఆర్మూరు(తెలంగాణ), జీహెచ్‌ఎస్‌, వెంగళ్‌రావునగర్‌(హైదరాబాద్‌)కు చెందిన విద్యార్థుల భాగస్వామ్యం ఉంది.

ఇందుకు హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ సంస్థ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద రూ.58 లక్షలు సమకూర్చింది. చెన్నైలోని స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది. సాయం అందించిన 15 మంది స్పేస్‌ కిడ్జ్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో తిరుపతికి చెందిన సాయి, రఘుపతి, హైదరాబాద్‌కు చెందిన కీర్తన్‌ ఉన్నారు.
ఇవీ చదవండి:

మూసీ ఉగ్రరూపం.. పరీవాహక ప్రాంతాల్లోని బస్తీలను ముంచెత్తిన వరద

దేశంలో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు.. అమెరికా, జపాన్​లో ఉగ్రరూపం

ABOUT THE AUTHOR

...view details