ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో 40.51 % మందికి వైరస్ సోకి, వెళ్లినట్లు 'సిరో సర్వైలెన్స్'లో తేలింది. వీరిలో ఎవరికి కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు లేవు. వీరి నుంచి సేకరించిన రక్త నమూనాలు పరీక్షించగా వైరస్ సోకి, వెళ్లినట్లు తెలిసింది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 3,709 మందికి పరీక్షలు చేయగా 19.41 % మందికి వైరస్ సోకి వెళ్లింది.
గుర్తించేందుకు
కరోనా వైరస్ వ్యాప్తి , ఇన్ ఫెక్షన్ సోకిన వాళ్లు ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని గుర్తించేందుకు కృష్ణా, తూర్పుగోదావరి, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో 'సిరో సర్వైలెన్స్'ను వైద్య ఆరోగ్య శాఖ ఇటీవల నిర్వహించింది. ఐసీఎంఆర్ మార్గదర్శకాలు అనుసరించి ఈ పరీక్షలు చేశారు. కృష్ణా జిల్లా ఫలితాలను విశ్లేషించినప్పుడు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. విజయవాడ అర్బన్‌లో 933 మందిలో కరోనా ప్రతి రక్షకాలు ఉన్నట్లు తేలింది. భవంతులు, గుడిసెలు , చిన్న ఇళ్లు, అపార్టుమెంట్లు, వైరస్ ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో ఎంపిక చేసిన వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు.
నమూనాలు పరీక్షించగా
నగరంలో వైరస్ తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యంగా, కృష్ణలంకలో 39 మంది నమూనాలు పరీక్షించగా 16 మందిలో వైరస్ సోకి వెళ్లినట్లు వెల్లడైంది. ఇదేవిధంగా రాణిగారితోటలో 40 మందికి చేయగా 29 మందికి, లంబాడిపేట 38-18 మందికి, రామలింగేశ్వరనగర్ 48-18, దుర్గాపురం 48-17, మధురానగర్ 32-20 , గిరిపురం - 39-18, ఎన్టీఆర్ కాలనీ - 43-16, ఆర్ఆర్ పేట 40-16 , లబ్బీపేట 21-4, పటమటలో 13 మంది నమూనాలు పరీక్షించగా ఐదుగురిలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు గుర్తించారు. రూరల్ పరిధిలోని కాసూరులో 69లో 8, గొల్లమూడిలో 150-14 , చిన్న ఓగిరాలలో 134 నమూనాలు పరీక్షిస్తే 15 , గొల్లపల్లిలో 140కు తొమ్మిది మందిలో యాంటీబాడీలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.