తెలంగాణ

telangana

ETV Bharat / city

పార్టీ కార్యాలయాల్లో ఘనంగా 'సెప్టెంబర్​ 17' వేడుకలు

రాష్ట్రంలోని పార్టీల కార్యాలయాల్లో సెప్టెంబర్‌ 17ని పురస్కరించుకొని వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేసిన తెరాస సెక్రటరీ జనరల్‌ కేశవరావు... విలీన దినోత్సవాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సెప్టెంబరు 17ను తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తాము అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవ నిర్వహణపైనే తొలిసంతకం పెడతామని భాజపా ప్రకటించింది. భాజపా చరిత్రను వక్రీకరిస్తోందని కమ్యూనిస్టులు మండిపడ్డారు.

september 17 celebration in telangana
september 17 celebration in telangana

By

Published : Sep 17, 2021, 10:17 PM IST

పార్టీ కార్యాలయాల్లో ఘనంగా 'సెప్టెంబర్​ 17' వేడుకలు

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో... తెలంగాణ విలీన దినోత్సవాన్ని తెరాస నిర్వహించింది. తెరాస సెక్రటరీ జనరల్‌ కేశవరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సెప్టెంబరు 17 భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజని... దీనిపై అనవసర వివాదం చేస్తున్నారని విమర్శించారు. సాయుధ పోరాటం, విలీన ఉద్యమం.. చరిత్రలో బంగారు పుటల్లో నిలిచిపోతాయన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవంగా నిర్వహిస్తాం

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సెప్టెంబరు 17ను తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గాంధీభవన్‌లో తెలంగాణ విలీన దినోత్సవాన్ని నిర్వహించారు. జాతీయ జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి... నెహ్రూ నిర్ణయం వల్లే విలీనం సాధ్యమైందని వివరించారు. వల్లభాయ్ పటేల్.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారని.. భాజపాకు చెప్పుకోవడానికి ఒక్కనాయకుడు లేరని ఎద్దేవా చేశారు.

తొలి సంతకం..

భాజపా నేతలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. కామారెడ్డి జిల్లా... ఎల్లారెడ్డిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ జాతీయ జెండాను ఎగుర వేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్‌ పాల్గొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలంటూ తొలి సంతకం చేస్తామని భాజపా తెలిపింది.

వారికేం సంబంధం..

హిమాయత్ నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. స్వాతంత్య్ర పోరాటం, సాయుధ పోరాటంలో వామపక్షాలు పాల్గొన్నాయని... భాజపా, ఆర్​ఎస్​ఎస్​లు అప్పుడు ఎక్కడున్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రశ్నించారు. దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం కోసం పోరాటం చేసింది కమ్యూనిస్టులు మాత్రమేననని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. పోరాటాలతో ఏ మాత్రం సంబంధం లేని భాజపా చరిత్రను వక్రీకరిస్తోందని విమర్శించారు.

అధికారికంగా నిర్వహించాలి..

హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకల్లో ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం పాల్గొన్నారు. తెలంగాణ చరిత్రను మరుగున పడకుండా ఉండాలంటే... విలీన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఇదీచూడండి:BJP: భాజపా అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతాం

ABOUT THE AUTHOR

...view details