Police Jobs in Telangana : పోలీసు కొలువుల జాతరకు తెర లేచింది. 16వేలకుపైగా పోస్టులకు నోటిఫికేషన్ సోమవారం వెలువడింది. దీంతో కొలువుల్ని దక్కించుకునేందుకు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీసు యూనిట్ల ఉచిత శిక్షణ శిబిరాల్లోకి అర్హుల ఎంపిక తుది దశకు చేరుకుంది. ఈ పరిస్థితుల్లో వారికి ఎలాంటి శిక్షణ అవసరముంటుంది? రాతపరీక్షలో ఏయే అంశాలకు ప్రాధాన్యమివ్వాలి? శారీరక దారుఢ్య పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలి? తదితర అంశాలపై తెలంగాణ పోలీస్ అకాడమీలో క్రితంసారి టాపర్లుగా నిలిచిన ఎస్సైల సూచనలు ఇవీ...
రాతపరీక్షలో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కీలకం :పోలీస్ ఎంపిక పరీక్షల్లో కీలకమైనది అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్. ఎస్సైతో పాటు కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి సిలబస్ దాదాపు ఒకటే. ప్రాథమిక రాతపరీక్షకు సంబంధించిన 200 మార్కుల్లో ఈ సబ్జెక్ట్ నుంచి 100 మార్కులుంటాయి. మెయిన్స్‌కు సంబంధించి ఎస్సై పోస్టులకు 400 (కానిస్టేబుల్ పోస్టులకు 200) మార్కుల్లో సగం ఈ సబ్జెక్ట్‌వే. మిగిలిన సగం జనరల్ సైన్స్‌కు సంబంధించినవి. మెయిన్స్‌లో 65 శాతానికిపైగా మార్కులొస్తే ఉద్యోగం దక్కే అవకాశముంది. ఈ సబ్జెక్టులో మూడొంతులు, జనరల్ సైన్స్‌లో సగం మార్కులు సాధిస్తే కొలువుకు దగ్గరైనట్లే.
Preparation for Police Jobs : రాతపరీక్షకు సంబంధించి అర్థమెటిక్‌లో 10-15, రీజనింగ్‌లో 20వరకు టాపిక్స్ ఉంటాయి. వీటిని 5-6 విడతలు క్షుణ్నంగా చదవాలి. రోజువారీ సన్నద్ధతలో సగం సమయం ఈ సబ్జెక్ట్‌కే కేటాయించాలి. ఉదాహరణకు రోజూ 10 గంటలు సాధన చేస్తే 5 గంటలు ఈ సబ్జెక్ట్‌పై దృష్టి సారించాలి.
దిల్‌సుఖ్‌నగర్‌లాంటి ప్రాంతాల్లోని శిక్షణ కేంద్రాల్లో వారాంతపు పరీక్షలు నిర్వహిస్తుంటారు. వీలైనన్ని ఎక్కువసార్లు వీటిని రాయాలి. ఈ పరీక్షలు మెయిన్స్ ప్యాటర్న్‌లో ఉంటాయి కాబట్టి తుదిపరీక్షకు బాగా ఉపయుక్తమవుతాయి. అలాగే మెయిన్స్ పరీక్షలో సమయాన్ని ఎలా వినియోగించుకోవాలనేది తెలుసుకోవచ్చు.
పరుగును మెరుగుపరుచుకోవడంపై దృష్టి.. :ఈ ఉద్యోగాలకు లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్, రన్నింగ్‌లాంటి శారీరక దారుఢ్య పరీక్షలు అదనంగా ఉంటాయి. ఎస్సైతోపాటు కానిస్టేబుళ్ల పోస్టులకూ ఈ ఈవెంట్లు ఒకేలా ఉంటాయి. వీటిలో పరుగుపందెం కీలకం. మహిళా అభ్యర్థులకు 100 మీటర్ల పరుగుపందెం నిర్వహిస్తుండగా, పురుషులకు 100 మీటర్లతో పాటు 800 మీటర్ల పరుగుపందెం అదనం. ఈ క్రమంలో పందెంలో నెగ్గుకురావడానికి సన్నద్ధత కీలకం.