తెలంగాణ

telangana

ETV Bharat / city

TS Schools reopen : బడికి పంపడం తల్లిదండ్రుల ఇష్టమే! - telangana schools reopen

సెప్టెంబర్​ ఒకటో తేదీ నుంచి అంగన్‌వాడీలు సహా అన్ని విద్యాసంస్థలను (TS Schools reopen) పునఃప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యక్ష బోధన ప్రారంభమవుతుందని ప్రభుత్వం చెప్పినా... పిల్లలను తప్పక తరగతులకు పంపాలా?.. లేదా? అన్న విషయాన్ని వెల్లడించలేదు.

TS Schools reopen
TS Schools reopen

By

Published : Aug 24, 2021, 9:33 AM IST

ఒకటో తేదీ నుంచి అంగన్‌వాడీలు సహా అన్ని విద్యాసంస్థలను (TS Schools reopen) పునఃప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసినా పిల్లలను తప్పక ప్రత్యక్ష తరగతులకు పంపాలా?.. లేదా? అన్న విషయాన్ని వెల్లడించలేదు. అధికారులు మాత్రం తప్పనిసరిగా పంపాలని చెప్పబోమంటున్నారు. అంటే పిల్లలను బడులకు పంపాలా? ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చా? అన్నది తల్లిదండ్రుల ఇష్టమేనని స్పష్టమవుతోంది. టీవీల ద్వారా డిజిటల్‌ పాఠాలు (Online class) యథావిధిగా కొనసాగుతాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మార్గదర్శకాలపై ఆయా శాఖలు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నాయి. పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన సీఎం సమావేశం తర్వాత అధికారులతో సమావేశమై చర్చించారు.

ఉపాధ్యాయ సంఘాల హర్షం

ప్రత్యక్ష బోధన ప్రారంభించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సంతోషదాయకమని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి అన్నారు. పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను నియమించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ‘స్వచ్ఛ కార్మికుల పునర్నియామకం చేపట్టాలి’ అని ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజాభాను చంద్రప్రకాశ్‌తో పాటు టీపీటీఎఫ్‌ కోరింది. ప్రభుత్వ నిర్ణయంపై టీఆర్‌టీఎఫ్‌, ఎస్‌జీటీ ఫోరం, తెలంగాణ తల్లిదండ్రుల సంఘం హర్షం వ్యక్తం చేశాయి. విడతల వారీగా తరగతులను ప్రారంభించాలని ఎస్‌సీ, ఎస్‌టీ ఉపాధ్యాయ సంఘం కోరింది. కళాశాలలను ప్రారంభించడంపై తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ విద్య ఐకాస స్వాగతిస్తోందని ఛైర్మన్‌ పి.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.

నెలాఖర్లోగా శుభ్రపరచి, శానిటైజేషన్ చేయాలి

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విద్యాసంస్థల పున:ప్రారంభానికి తీసుకుంటున్న చర్యలు, తదితర అంశాలపై మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ (CM KCR) సోమవారం చర్చించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అన్ని రకాల ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలు, అంగన్వాడీలనూ తెరవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి వచ్చిందన్న వైద్యారోగ్యశాఖ నివేదిక ఆధారంగా, విద్యార్థుల భవిష్యత్​ను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలను నెలాఖర్లోగా శుభ్రపరచి, శానిటైజేషన్ చేయాలని పంచాయతీరాజ్, పురపాలకశాఖలను ఆదేశించారు. విధిగా మాస్కులు ధరించేలా, శానిటైజేషన్ చేసుకోవడం లాంటి కొవిడ్ నియంత్రణ చర్యలు విద్యార్థులు తీసుకునేలా చూడాలని తల్లిదండ్రులను కేసీఆర్ కోరారు.

విద్యావ్యవస్థ ఇబ్బందుల్లో పడింది

కరోనా కారణంగా విద్యావ్యవస్థ ఇబ్బందుల్లో పడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. విద్యాసంస్థల మూసివేతతో విద్యార్థులు, తల్లిదండ్రులు సహా ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యా అనుబంధ రంగాల్లో అయోమయ పరిస్థితి నెలకొందని తెలిపారు. గతం కంటే రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి వచ్చిందని వైద్యాధికారులు నివేదికలు ఇచ్చారని సీఎం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో జనసంచారం సాధారణ స్థాయికి వస్తోందన్నారు. విద్యాసంస్థలను నిరంతరాయంగా మూసివేయడం వల్ల విద్యార్థుల్లో ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరుగుతోందని.. అది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపే పరిస్థితి ఉందన్న అధ్యయనాన్ని వైద్యారోగ్యశాఖ అధికారులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారని కేసీఆర్​ తెలిపారు.

ఇదీ చదవండి :అంగన్వాడీ కేంద్రాలు సహా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల పునఃప్రారంభం

ABOUT THE AUTHOR

...view details