కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాదీ ఆన్‌లైన్ చదువులే కొనసాగుతున్నాయి. టీశాట్ యాప్, టీవీల్లో వచ్చే పాఠాలు చూసి నేర్చుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇందుకు స్థానిక ఉపాధ్యాయులు చొరవ చూపాలని ఆదేశించింది. అయితే తెరపై చూసిన పాఠ్యంశాలకు సంబంధించి ఎలాంటి పరీక్షలు ఉండవు. దీంతో విద్యార్థి ఎంత వరకు నేర్చుకున్నాడు అనేది స్పష్టం కావడం లేదు. ఈ సమస్య గుర్తించిన విద్యా శాఖ జనవరిలో ఇంటింటా చదువుల పంట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం కొనసాగిస్తోంది. ఇందులో విద్యార్థుల నమోదు సంఖ్య బాగున్నా వినియోగించుకోవడంలో మాత్రం వెనకబడ్డారు. ఉపాధ్యాయులు దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
ఈ నెల 1వ తేదీ నుంచి 3-10 తరగతుల విద్యార్థులకు అంతర్జాలం ద్వారా పాఠాలు చెబుతున్నారు. మారుమూల గ్రామాల్లో సిగ్నల్స్ అందకపోవడంతో పిల్లలు చదువులకు దూరంగా ఉంటున్నారు. కేవలం 75 శాతం మంది విద్యార్థులే పాఠాలు వింటున్నట్లు జిల్లాల విద్యాధికారులు నివేదికలు చెబుతున్నాయి. పాఠాలు వినలేని వారు చదువులో వెనకబడతారన్న ఆందోళన నెలకొంది. పాఠాలు వింటున్న వారు ఎంత వరకు నేర్చుకున్నారో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో విద్యార్థులే స్వీయ పరీక్ష(ONLINE EXAM) నిర్వహించుకునేలా ప్రభుత్వం ప్రత్యేకంగా వాట్సాప్ నంబరు అందుబాటులోకి తెచ్చింది.
రోజుకు 10 ప్రశ్నలు
విద్యార్థులు వాట్సాప్(ONLINE EXAM) ద్వారా ‘నమస్తే’ అని 85855 24405 నెంబరుకు సందేశం పంపాలి. విద్యార్థి పేరు, తరగతి, మాధ్యమం నమోదు చేయాలి. తరగతికి సంబంధించి ప్రతివారం రెండు పాఠ్యంశాలకు సంబంధించిన 10 అబ్జెక్టివ్ ప్రశ్నలు వాట్సాప్ ద్వారా పంపుతారు. ఇవి తెలుగు, ఆంగ్ల, ఉర్దూ మాధ్యమాల్లో ఉంటాయి. వాటికి సమాధానాలు ఎంపిక చేసి సబ్మిట్ చేయాలి. సమాధానాలు తప్పు రాస్తే వెంటనే సందేశం వస్తుంది. విద్యార్థికి అర్ధమయ్యేలా వీడియో పాఠం అందుబాటులో ఉంటుంది. దీనిని చూడటం ద్వారా సరైనా సమాధానం తెలుసుకోవచ్ఛు.
వినియోగంలో వెనుకబాటు..
‘ఇంటింటా చదువుల పంట(ONLINE EXAM)’ కార్యక్రమాన్ని ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు వికారాబాద్ జిల్లాలో పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లేదు. 26,402 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 794 మంది విద్యార్థులు మాత్రమే సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో ఆశించిన ఫలితం దక్కడం లేదు. దీంతో జిల్లాల విద్యాధికారులు ఇటీవల జూమ్ ద్వారా ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు రాశారు.. ఎన్ని సరైన సమాధానాలు రాశారు అనే నివేదికలు తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. దీని ద్వారా ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థంగా విద్యార్థులకు చేరువ చేయాలని భావిస్తున్నారు.