Amitshah Hyderabad Tour Security: ఇవాళ ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమంలో అమిత్‌షా పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి హరిత ప్లాజా వైపు కేంద్రహోంమంత్రి అమిత్‌షా కాన్వాయ్ వెళ్లిన సమయంలో జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. హరిత ప్లాజా వద్ద ఆగిన సమయంలో అమిత్‌షా కాన్వాయ్‌కు అడ్డంగా ఓ తెరాస నేత కారు వచ్చింది. దీంతో కొద్దిసేపు కాన్వాయ్ ముందుకు వెళ్లలేదు. దాదాపు 5 నిమిషాల పాటు సదరు వ్యక్తి కారును పక్కకు తీయకపోవడంతో భద్రతా సిబ్బంది ఆ వాహనం అద్దాలు పగలగొట్టారు. అమిత్‌షా కాన్వాయ్‌కు కారు అడ్డంగా పెట్టిన వ్యక్తిని మంచిర్యాల జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన తెరాస నేత గోసుల శ్రీనివాస్‌గా పోలీసులు గుర్తించారు.
ఉద్దేశపూర్వకంగా కారును అడ్డుగా పెట్టలేదు..అమిత్ షా కాన్వాయ్‌కు అడ్డు వచ్చిన కారు ఘటనపై తెరాస నేత గోసుల శ్రీనివాస్ స్పందించారు. తాను ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదని వివరణ ఇచ్చారు. టూరిజం ప్లాజాలోని మినర్వా హోటల్లో కాఫీ తాగేందుకు వెళ్లానని, ఆ టైమ్‌లో తన కారు ముందున్న ఇన్నోవా కారు.. స్లో కావడంతో ముందుకు వెళ్లలేకపోయానని అన్నారు. అదే సమయంలో అమిత్ షా కాన్వాయ్ వస్తుందని హడావుడి చేస్తూ 15 మంది పోలీసులు తన కారు అద్దాలు పగులగొట్టారని శ్రీనివాస్ చెప్పారు.