తెలంగాణ

telangana

ETV Bharat / city

Secunderabad Violence: సుబ్బారావు అరెస్టుకు రంగం సిద్ధం - అగ్నిపథ్​ అల్లర్లు

అగ్నిపథ్‌ను నిరసిస్తూ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో సృష్టించిన విధ్వంసానికి సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావు మద్దతిచ్చారని రైల్వే పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. సుబ్బారావును అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు విధ్వంసానికి అతడు సహకరించాడని నిరూపించే సాక్ష్యాధారాలను సేకరించినట్టు తెలిసింది. గురువారం అతడిని అరెస్టు చేసే అవకాశాలున్నాయి.

Avula subbarao arrest
సుబ్బారావు

By

Published : Jun 23, 2022, 5:23 AM IST

ఆర్మీ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఎంపికైన అభ్యర్థులు అగ్నిపథ్‌ను నిరసిస్తూ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో సృష్టించిన విధ్వంసానికి సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావు మద్దతిచ్చారని రైల్వే పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. వారు సేకరించిన ప్రాథమిక ఆధారాలు, అరెస్టయిన నిందితుల వాంగ్మూలాలను బుధవారం కోర్టుకు సమర్పించారు. సుబ్బారావుతో పాటు సాయి అకాడమీ ప్రతినిధి శివ ఈ కుట్రలో భాగస్వామి అని, వీరిద్దరూ విధ్వంసానికి ముందురోజు (జూన్‌ 16) సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చారని, హకీంపేట సోల్జర్స్‌ వాట్సప్‌ గ్రూప్‌లో ఆర్మీ అభ్యర్థులతో వీరిద్దరూ వేర్వేరుగా తీసుకున్న ఫొటోలున్నాయని నివేదించారు. సుబ్బారావును అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు విధ్వంసానికి అతడు సహకరించాడని నిరూపించే సాక్ష్యాధారాలను సేకరించినట్టు తెలిసింది. గురువారం అతడిని అరెస్టు చేసే అవకాశాలున్నాయి. అగ్నిపథ్‌ పథకం అమల్లోకి వస్తే డిఫెన్స్‌ అకాడమీలకు రూ.20 కోట్ల మేర నష్టం వస్తుందనే భావనతో విధ్వంసానికి కొన్ని అకాడమీల ప్రతినిధులు మద్దతు ప్రకటించారన్న కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

50 శాతం మంది పాసైతే చాలు
ఉమ్మడి ప్రవేశ పరీక్షకు అర్హులైన రెండు వేల మంది అభ్యర్థులు.. సాయి డిఫెన్స్‌ సహా వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లోని వివిధ అకాడమీల్లో శిక్షణ పొందుతున్నారు. కరోనా ప్రభావంతో 15 నెలల నుంచి పరీక్ష పలుమార్లు వాయిదా పడింది. అగ్నిపథ్‌ వచ్చాక ఏకంగా దాన్ని రద్దు చేయడంతో అభ్యర్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇదే సమయంలో సాయి డిఫెన్స్‌ సహా పలు అకాడమీల యజమానులు.. అగ్నిపథ్‌ వల్ల తమ వ్యాపారానికి రూ.కోట్లలో నష్టం వస్తుందని లెక్కలు వేసుకున్నారు. కొన్నేళ్లుగా ఈ అకాడమీలు ఆర్మీలో చేరాలనుకున్న అభ్యర్థుల వద్ద నామమాత్రంగా రుసుం తీసుకుని శిక్షణ ఇస్తున్నాయి. సైన్యంలోకి ఎంపికైతే.. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.2 లక్షల చొప్పున వసూలు చేస్తున్నాయి. రెండువేల మందికి శిక్షణ ఇస్తున్న అకాడమీలు అందులో సగం మందికి ఉద్యోగాలొచ్చినా, తమకు రూ.20 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేశాయి. అగ్నిపథ్‌ అమలైతే ఈ సొమ్ము నష్టపోతామని భావించిన ఆవుల సుబ్బారావు, శివ తదితరులు ఆర్మీ అభ్యర్థులు విధ్వంసానికి పాల్పడేలా అన్నివిధాలా సహాయ సహకారాలు అందించారని రైల్వేపోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:'సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అలర్లలో పాల్గొన్న యువకుడు ఆత్మహత్యాయత్నం'

ABOUT THE AUTHOR

...view details