తెలంగాణ

telangana

ETV Bharat / city

అగ్నిపథ్​పై ఆగ్రహజ్వాలలు.. రణరంగంగా సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​ - protest on agneepath

కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కనీవినీ ఎరగని రీతిలో విధ్వంసం చెలరేగింది. ఒక్కసారిగా దూసుకువచ్చిన వేలమంది ఆర్మీ ఆశావహులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. 8 రైళ్లకు చెందిన బోగీలను తగులబెట్టారు. షాపులను లూటీ చేశారు. ఆర్టీసీ బస్సులపైనా దాడిచేశారు. పక్కా పథకం ప్రకారం జరిగిన ఆ దమనకాండను ఆపేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతిచెందగా.. పలువురికి బుల్లెట్లు తాకి గాయాలయ్యాయి. ఉదయం మొదలైన నిరసనలను అతికష్టం మీద సాయంత్రానికి పోలీసులు అదుపు చేశారు.

secunderabad railway station incident full story
secunderabad railway station incident full story

By

Published : Jun 18, 2022, 4:03 AM IST

ఇంతవరకు ఎన్నడూ జరగని విధ్వంసం.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగింది. ప్రత్యేక ఉద్యమం ఉవ్వెత్తున లేసిన సమయంలోనూ... ఈ స్థాయిలో హింసాత్మక ఘటనలు జరగలేదు. తెలంగాణలో 8 ఏళ్ల తర్వాత పోలీస్‌ తుపాకీ తూటా పేలింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు సహా AP నుంచి వేల సంఖ్యలో తరలివచ్చిన అగ్నిపథ్‌ అసంతృప్తులు.. పక్కా పథకం ప్రకారం చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. నిరసనకారుల దాడులతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ భీతావహంగా మారింది. సైనికుల ఎంపిక కోసం కేంద్రం కొత్తగా ప్రతిపాదించిన అగ్నిపథ్ పథకంపై గతంలో ఆర్మీ రిక్కూట్‌మెంట్‌కు ఎంపికైన అభ్యర్థులు, నిరుద్యోగులు అసంతృప్తిలో ఉన్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ గురువారం దేశవ్యాప్తంగా నిరసనలు జరగ్గా... శుక్రవారం అవి సికింద్రాబాద్‌ను తాకాయి. అగ్నిపథ్‌ పథకంపై తమ వ్యతిరేకతను కేంద్రానికి తెలియచెప్పాలనే లక్ష్యంతో ఉన్న యువత తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కేందుకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను ఎంచుకున్నారు.

ఉదయం 9గంటల వరకూ స్టేషన్లో పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. సుమారు 9.15 గంటల సమయంలో ఒక్కసారిగా మూడోనంబరు గేటు నుంచి వందల సంఖ్యలో యువకులు.. ఒకటో నంబరు ప్లాట్‌ఫాం వైపు చొచ్చుకొచ్చారు. పక్కా ప్రణాళిక ప్రకారం... ఓలిఫెంటా బ్రిడ్జ్‌ నుంచి కొందరు, పదో నంబర్‌ ప్లాట్‌ఫాం వైపు నుంచి మరికొందరు స్టేషన్‌లోకి చొరబడ్డారు. ఇంకొందరు అప్పటికే రైల్వేస్టేషన్లో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. స్టేషన్‌లోకి ప్రవేశించిన సుమారు 2 వేల మంది నిరసనకారులు వచ్చీరాగానే విధ్వంసం మొదలుపెట్టారు. కనిపించిన వస్తువునల్లా పగలగొట్టారు. ఊహించని ఈ పరిణామంతో అక్కడ ఉన్న ఆర్పీఎఫ్​, రైల్వే జనరల్ పోలీసులు తలో దిక్కుకు పరుగులు తీశారు. నిరసనకారులు వెంట తెచ్చుకున్న పెట్రోలును అజంతా ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌-రాయపుర్‌, ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ సహా 8 రైళ్ల బోగీలపై చల్లి నిప్పంటించారు. ఏం జరుగుతుందో తెలిక ఆందోళనకు గురైన ప్రయాణికుల అరుపులు, హాహాకారాలతో స్టేషన్ ఆవరణం దద్దరిల్లింది.

రైల్వే బోగీలకు నిప్పటించి మంటలను ఆర్పేందుకు వస్తున్న అగ్నిమాపక శకటాలు రాకుండా అడ్డుకున్నారు. రైళ్లకు నీళ్లు సరఫరా చేసే పైపులను ఆపేశారు. ఊహించని విధ్వంసం మొదలుకావడంతో రైల్వే పోలీసులు.. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. నిరసనకారులను శాంతింపజేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వగా పలువురికి గాయాలయ్యాయి. గాల్లోకి కాల్పులు జరిపినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో నేరుగా ఆందోళనకారులపైకే పోలీసులు తుపాకీ ఎక్కుపెట్టారు. ఈ కాల్పుల్లో వరంగల్‌ జిల్లాకు చెందిన దామెర రాకేష్‌ చనిపోగా... మరో 12 మందికి గాయాలయ్యాయి. భారీ స్థాయిలో పోలీసు బలగాలను రంగంలోకి దింపడం, అప్పటికే చాలామంది ఆందోళనకారులు చెల్లాచెదురు కావడంతో మధ్నాహం తర్వాత పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. దాంతో ఒకపక్క రైల్వే సహాయక బృందాలు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాయి. మొత్తంగా ఈ ఘటనలో రైల్వే శాఖకు 7 కోట్ల వరకూ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.

చర్చలకు రావాల్సిందిగా రైల్వే సహా రాష్ట్ర పోలీసులు ఆహ్వానించినా నిరుద్యోగులు ససేమిరా అన్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కే ఆర్మీ అధికారులు రావాలని, ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించాలని, అగ్నిపథ్‌ రద్దు చేయాలని, కాల్పుల్లో చనిపోయినవారి కుటుంబ సభ్యులకు కోటి నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. పట్టాలపైనే నిరసన ప్రదర్శన కొనసాగించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో పోలీసులు ఆందోళనకారులను అక్కణ్నుంచి తరిమేశారు. కొందర్ని అదుపులోకి తీసుకోవడంతో దాదాపు 8 గంటల పాటు సాగిన విధ్వంసకాండకు తెరపడింది. అనంతరం బృందాలుగా విడిపోయి నాలుగు ప్లాట్‌ఫాంల పట్టాలపై బైఠాయించారు. వందేమాతరం, జైజవాన్‌ నినాదాలతో హోరెత్తించారు. జాతీయ పతాకాన్ని, సేవ్‌ ఆర్మీ ప్లకార్డులను ప్రదర్శించారు. అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే రిక్రూట్‌మెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. తమకు ఏ పార్టీతో, విద్యార్థి సంఘాలతో సంబంధంలేదన్నారు.

సైన్యంలోకి ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఆర్మీ అధికారులు 15 నెలలుగా రద్దు చేస్తూ వస్తున్నారు. చివరికి అగ్నిపథ్‌ పేరుతో కొత్త పద్ధతిలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు. దాంతో రెండు సంవత్సరాలుగా పరీక్ష రాసేందుకు ఎదురుచూస్తున్న అభ్యర్థులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. పరుగుపందెం, వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యామని, పరీక్ష రాసి ఫలితాలొస్తే సైన్యంలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఇప్పుడు కొత్త పద్ధతి ప్రవేశపెట్టడం ఏమిటని వారంతా ఆగ్రహంతో ఉన్నారు. అందుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని రైల్వేస్టేషన్లు, ఆర్మీ కార్యాలయాల ఎదుట నిరసనలు తెలపాలని నిర్ణయించుకున్నారు. ఆర్మీ క్యాండిడేట్స్‌, ఆర్మీ బ్రదర్స్‌, ఆర్మీ కోచింగ్‌ క్యాండెట్స్‌ పేరుతో వాట్సాప్‌ గ్రూపులు నిర్వహిస్తున్న వారంతా ఆయా గ్రూపుల్లో సమాచారాన్ని చేరవేసుకున్నారు. ఆ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలకు చెందినవారు గురువారం రాత్రే వేర్వేరు రైళ్లలో సికింద్రాబాద్‌కు చేరుకున్నారు. మిగిలిన జిల్లాల వారంతా శుక్రవారం ఉదయాన్నే అక్కడికి వచ్చారు. సుమారు రెండువేల మంది ఒకచోటుకు చేరుకున్నాక కార్యాచరణ రూపొందించుకున్నారు. పోలీసుల కాల్పుల్లో బుల్లెట్టు తగిలి మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచ గ్రామానికి చెందిన లక్కం వినయ్ గాయపడ్డారు. వినయ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మాట్లాడుతూ... తను చనిపోతే పోలీసులు, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగే కారణమని తెలిపారు.

ఆందోళనకారుల్లో 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో 50 మందిని అదుపులోకి తీసుకుని వివిధ స్టేషన్‌లకు తరలించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనలో పోలీసులు ఆందోళనకారులను నిలువరించకపోతే పెను విధ్వంసమే జరిగి ఉండేది. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం కొందరు ఆందోళనకారులు స్టేషన్‌కు ఆనుకుని ఉన్న డీజిల్ ఇంధన డిపోపై దాడిచేసేందుకు దూసుకువచ్చారు. డిపో సమీపంలో ఉన్న 4 వేల లీటర్ల హెచ్​ఎస్​వో ఆయిల్, 3 వేల లీటర్ల ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఉన్న లోకో ఇంజిన్‌ వైపు దూసుకొచ్చి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. ప్రమాదాన్ని పసిగట్టిన పోలీసులు వారిని నిలువరించారు. లేకుంటే పెద్ద విస్ఫోటనం జరిగి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించి ఉండేదని భావిస్తున్నారు.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న తీవ్ర ఆందోళనల దృష్ట్యా.... రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం చేసి పలు సర్వీసులను నిలిపివేశాయి. మెట్రో, ఎంఎంటీఎస్​ రైళ్లను ఆపేశారు. జిల్లాల్లోని ప్రధాన స్టేషన్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో సాయంత్రం ఆరున్నర గంటలకల్ల్లా రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details