ప్రకాశం జిల్లా కనిగిరి దుర్గం వద్ద గుప్తనిధుల కోసం కొందరు తవ్వకాలు చేపట్టడం కలకలం రేపుతోంది. ఈ దుర్గంతో పాటు, సమీపంలోని గొల్లభామ చెరువు, పనస వాగు, ఏనుగుల వాగు, చాకలి కుంట, దొంగల బావి తదితర ప్రాంతాల్లో రాజులు కట్టించిన కట్టడాలే కాకుండా వారి కాలంలో నిర్మించిన రాక్షస గూళ్లు (సామూహిక సమాధులు) ఉన్నాయి. నాడు ఈ ప్రాంతాలను కాటమరాజు, శ్రీకృష్ణ దేవరాయలు, కాకతీయులు పాలించిన చరిత్ర ఉంది.
గుర్తుతెలియని వ్యక్తులు వివిధ కట్టడాలు ఉండే ఈశాన్య మూలల్లో తవ్వకాలు చేపట్టారు. పొక్లెయిన్‌తో తవ్వి గుంతలమయం చేశారు. చారిత్రక ఆనవాళ్లు లేకుండా చేశారు. పూజలు చేసినట్లుగా గురుతులు ఉన్నాయి. ఔత్సాహిక పరిశోధకులు, ఉపాధ్యాయులు కొండ్రెడ్డి భాస్కర్‌రెడ్డి, కేవీ రమణారెడ్డి, టి.శ్రీనివాసులరెడ్డి, ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఆ ప్రాంతాలను పరిశీలించారు. తవ్వకాల్లో దుండగులు పడవేసిన పురాతన కుండలు, ఇటుక, ఇతర మట్టి, వంట పాత్రలను స్వాధీనం చేసుకున్నారు.