రాష్ట్రంలో రెండోరోజు కేంద్ర బృందాల పర్యటన కొనసాగింది. హైదరాబాద్‌లో రెండో రోజు నాగోల్, బండ్లగూడ చెరువుల నుంచి నాలాల్లోకి వస్తున్న వరదనీటిని కేంద్రబృందం పరిశీలించింది. ముంపుతో జరిగిన నష్టంపై అధికారులు, స్థానికుల నుంచి వివరాలు సేకరించింది. అనంతరం నాగోల్ రాజరాజేశ్వరి కాలనీలో ముంపు ప్రాంతాలను సందర్శించిన బృందం.. కర్మాన్‌ఘాట్ మేఘాఫంక్షన్ హాల్ నుంచి వెళ్తున్న నాలాను పరిశీలించింది. మీర్‌పేట, బైరామాల్‌గూడ నాలాల కింద.. ముంపునకు గురైన ప్రాంతాలను సందర్శించింది. ఆ తర్వాత.. ఉదయ్‌నగర్, మల్‌రెడ్డి రంగారెడ్డినగర్, తపోవన్ కాలనీలో నీటిమునిగిన 2వేల ఇళ్లను పరిశీలించింది. సరూర్ నగర్ చెరువును సందర్శించిన బృందం... గడ్డిఅన్నారం డివిజన్‌లో.. ముంపునకు గురైన కోదండరామ్‌నగర్‌ను పరిశీలించింది. వరద ఇళ్లు దాదాపు 6 అడుగుల మేర ముంపునకు గురైనట్లు బాధిత కుటుంబాలు... కేంద్రకమిటీకి విన్నవించాయి. ఆయా ప్రాంతాలకు మూసీ కిలోమీటర్ దూరంలో ఉన్నాయని నీటిపారుదల, జీహెచ్ఎంసీ అధికారులు వివరించారు. ఓవర్‌ఫ్లో అయ్యే నీరు మూసీలో కలిపేందుకు నాలా ఏర్పాటు చేస్తామని.. అనువైన డిజైన్ల తయారీకి కన్సల్టెన్సీకి అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం బాల్‌రెడ్డినగర్, టోలీచౌకీ, విరాసత్ నగర్, నదీం కాలనీల్లో కేంద్రం బృందం పర్యటించింది.
ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు..
జిల్లాల్లోనూ వివిధ ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని మరో బృందం అంచనా వేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల, శ్రీనగర్ గ్రామాల్లో పర్యటించి.. పంటనష్టంపై వివరాలు సేకరించింది. అనంతరం అబ్దుల్లాపూర్ మెట్ మండలం గౌరెల్లిలో పంటలను పరిశీలించిన బృందం సభ్యులు.. రైతులతో మాట్లాడారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో నేలకొరిగిన పంటల వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. చేతికందే దశలో భారీ వర్షాలకు వరి పూర్తిగా పాడైపోయిందని కేంద్ర బృందం సభ్యులకు అన్నదాతలు వివరించారు. లోతట్టు ప్రాంతం కావడం వల్ల నీరు నిలిచే అవకాశం ఉంది కదా..? అని కేంద్రం బృందం సభ్యులు ప్రశ్నించగా.. వర్షాలు, బోర్ల ద్వారా సాగయ్యే భూములని అధికారులు వివరించారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని రైతులు వివరించారు.