గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో... రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2020 డిసెంబర్ 1న ఎన్నికలు జరగ్గా... 9 వరకు అన్ని డివిజన్ల ఫలితాలు వెల్లడయ్యాయి. ఎన్నికలు పూర్తైనా... ప్రస్తుత పాలకమండలి గడవు పూర్తి కాకపోవడం వల్ల రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి ప్రక్రియ చేపట్టలేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జీహెచ్ఎంసీకి 2015లో ఎన్నికలు జరిగాక పాలకమండలి ఫిబ్రవరి 11న కొలువుదీరింది. అప్పటి నుంచి ఐదేళ్లపాటు అంటే రానున్న ఫిబ్రవరి 10వరకు గడువు ఉంది. అంతకుముందే మిగతా ప్రక్రియ చేపట్టే వీలులేనందున.... నిబంధనల ప్రకారం నెలలోపు గడువు ఉండేలా ఎస్ఈసీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రత్యేక సమావేశం
గెజిట్ నోటిఫికేషన్‌తో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం తేదీని ఖరారు చేసి విడిగా నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 11 లేదా ఆ తర్వాత ఎప్పుడైనా... తేదీని ఖరారు చేయవచ్చు. కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు పాలకమండలిని ప్రత్యేకంగా సమావేశపరుస్తూ నెలాఖరున... ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేయనుంది.