తెలంగాణ

telangana

ETV Bharat / city

'నాకు జారీ చేసిన నోటీసులకు విచారణ పరిధి లేదు'

ప్రివిలేజ్ మోషన్ నోటీసుపై ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ శాసనసభా కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు లేఖ రాశారు. శాసనసభ, ఎమ్మెల్యేలపై అపారమైన గౌరవం ఉందన్న ఆయన... తనకు జారీ చేసిన నోటీసులకు విచారణ పరిధి లేదన్నారు.

'నాకు జారీ చేసిన నోటీసులకు విచారణ పరిధి లేదు'
'నాకు జారీ చేసిన నోటీసులకు విచారణ పరిధి లేదు'

By

Published : Mar 19, 2021, 9:39 PM IST

ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ జారీ చేసిన నోటీసులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. ఈమేరకు శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు లేఖ రాశారు. సభా హక్కులకు భంగం కలిగించారంటూ చేసిన ఆరోపణల్ని ఖండిస్తున్నానని ఎస్ఈసీ పేర్కొన్నారు. శాసనసభ అంటే తనకు అపారమైన గౌరవం ఉందని ఎస్​ఈసీ చెప్పారు. సభా హక్కులు ఉల్లంఘించారంటూ తనకు జారీ చేసిన నోటీసులకు విచారణ పరిధి లేదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. దీనిపై మరింత ముందుకు వెళ్లాలని భావిస్తే తగినన్ని ఆధారాలు సమర్పిస్తానని స్పష్టం చేశారు. ఈ విషయంలో తగినంత సమయం ఇవ్వాలని ఎస్ఈసీ కోరారు. ఇటీవలే కొవిడ్ టీకా తీసుకున్నందున ప్రస్తుతం ప్రయాణాలు చేయలేనని ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖలో వివరించారు.

ఎస్‌ఈసీపై సభా హక్కుల ఉల్లంఘన కింద మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండు, మరో మంత్రి బొత్స సత్యనారాయణ ఒక నోటీసును శాసనసభ సభాపతికి ఇచ్చారు. వాటిని స్పీకర్‌ ప్రివిలేజ్‌ కమిటీకి పంపారు. ఆ ఫిర్యాదులను విచారణకు స్వీకరించిన కమిటీ.. ‘వాటిపై వివరణ ఇవ్వాలి. అవసరమైతే వ్యక్తిగతంగా కూడా హాజరు కావాల్సి ఉంటుంది’ అంటూ ఎస్‌ఈసీకి నోటీసులు జారీ చేసింది.

ఇదీ చదవండి: ఏపీ సీఐడీ కేసులో చంద్రబాబు, నారాయణకు ఊరట

ABOUT THE AUTHOR

...view details