ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసు(Viveka Murder Case)లో సీబీఐ(CBI) విచారణ కొనసాగుతోంది. పులివెందులలోని వివేకా ఇంటిని సీబీఐ అధికారులు మరోసారి పరిశీలించారు. హత్య జరిగిన ప్రదేశాలైన బెడ్‌రూం, బాత్‌రూంను పరిశీలించారు. మరోసారి సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేశారు. ఇంటి పరిసరాలను కొలిచి.. వీడియో, ఫొటోలు తీశారు.
హత్య జరిగిన ముందురోజు రాత్రి దుండగులు ఏ విధంగా ఇంట్లోకి ప్రవేశించి ఉంటారో అధికారులు అంచనా వేశారు. ఆరుగురు సీబీఐ(CBI) అధికారులు టీషర్టులకు పేర్లు రాసి వారి ద్వారా ట్రయల్స్ నిర్వహించారు. ఇద్దరు దుండగులు పల్సర్ బైకుపై వివేకా ఇంటి వద్దకు వచ్చినట్టు.. వారిలో ఒకరు గేటు తీసుకుని నేరుగా ఇంట్లోకి వెళ్లిపోయినట్టు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. మరో ముగ్గురు అధికారులు నిందితుల్లా ట్రయల్స్‌లో పాల్గొనగా.. వారు వివేకా ఇంటి ముందు నుంచి ఒకే బైకులో వెళ్లిపోవడాన్ని సీబీఐ వీడియో తీసింది.