Shilpa Surana: కళారూపాల తయారీలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న.. ఏపీ విశాఖ వాసి శిల్పా సురానా గురించి ప్రత్యేక కథనం. శిల్ప వాళ్లది రాజస్థాన్‌లోని రతన్గడ్కు చెందిన వ్యాపార కుటుంబం. బీకాం చేశారు. 24 ఏళ్లపుడు దూరపు బంధువైన రాజేశ్‌ను పెళ్లి చేసుకుని విశాఖపట్నం వచ్చారు. వీళ్లకి ముగ్గురు పిల్లలు. 35 ఏళ్ల వరకూ వారి ఆలనాపాలనా చూడటంలోనే గడిచిపోయింది. పిల్లలు స్కూలుకు వెళ్లడం మొదలయ్యాక చాలా సమయం మిగిలేది. ఏం చేయాలా అని ఆలోచించినపుడు.. తనకు బొమ్మలు వేసే నైపుణ్యం ఉందన్న విషయం గుర్తొచ్చింది. కళలపైన తన ఆసక్తిని భర్తకు చెబితే, ఆయనా ప్రోత్సహించారు.
ఆంధ్రా యూనివర్సిటీలో మూడేళ్ల బి.ఎఫ్.ఎ(బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్), ఆపైన మాస్టర్స్ కూడా పూర్తిచేసి వాటర్ పెయింటింగ్స్, పెన్సిల్ స్కెచెస్, పోస్టర్ పెయింట్స్, ఆక్రిలిక్ పెయింట్స్, ఆయిల్ పెయింట్స్, మ్యూరల్స్, రిలీఫ్ వర్క్స్, బ్రాంజ్ క్యాస్టింగ్, టెర్రకోట, పేపర్ పల్ప్ వర్క్స్, 3డీ స్కల్ప్చర్స్ చేయగలగే సామర్థ్యం సంపాదించారు. ‘తర్వాత ఏంటి?’ అన్న ప్రశ్న ఎదురైనపుడు... తనే కళారూపాలను తయారు చేయాలనుకున్నారు. కానీ దానికి చాలా ఖర్చవుతుంది. ప్రత్యేకంగా చోటూ కావాలి. నేనున్నానంటూ భర్త అండగా నిలిచారు. తన కళాకృతులను ప్రదర్శించేందుకు ఆయన నడిపే టైల్స్ దుకాణంలో కొంత స్థలాన్ని కేటాయించారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు శిల్ప. తన మనసులో మెదిలే ఆలోచనల్నే కళ్ల ముందు ఆవిష్కరిస్తూ వివిధ రకాల కళాకృతులను చేయడం మొదలుపెట్టారు. వీటన్నింటిలోకి ఆమెకు అత్యంత ఇష్టమైనదీ, పేరుతెచ్చిందీ ఫైబర్ గ్లాస్ ఉపయోగించి చేసే 3డీ స్కల్ప్చర్స్.
మట్టితో రూపొందించి..ఫైబర్‌గ్లాస్ 3డీ విగ్రహం తయారీకి ముందుగా మట్టితో ఆ బొమ్మని తయారుచేసుకుంటారు. తర్వాత దానిపై ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పోతపోసి మౌల్డ్ తీసుకుంటారు. ఆ మౌల్డ్ సాయంతో ఫైబర్గ్లాస్ను పొరలు పొరలుగా వేస్తూ విగ్రహాన్ని తయారుచేస్తారు. దానికి సరైన నునుపుదనం తీసుకురావడానికి రోజుల తరబడి పాలిష్ చేస్తారు. ఒక్కో విగ్రహం తయారీకి 2 - 4 నాలుగు వారాలు పడుతుంది. అవి నున్నగా మెరవడం కోసం చేసే పాలిషింగ్ అత్యంత ముఖ్యమైన పని. శిల్ప చేసిన విగ్రహాలు వినియోగదారులను ఆకర్షించాయి. దీంతో స్వల్ప వ్యవధిలోనే డిమాండ్ పెరిగిపోయింది. 2 నుంచి 20 అడుగుల ఎత్తు వరకూ విగ్రహాలను తయారు చేస్తుంటారీమె! వీటిలో ఎక్కువగా జైన మత తీర్థంకరుడు వర్థమాన మహావీరుడివే ఉంటాయి. విశాఖ నగరంలోని వాల్తేర్ క్లబ్, బీచ్ రోడ్, కన్వెన్షన్ సెంటర్లలో శిల్ప కళారూపాలు కొలువుదీరాయి. ఈమె గురువు రవిశంకర్ పట్నాయక్ (విశాఖ బీచ్‌రోడ్ సుందరీకరణ పనులు చేసిన వ్యక్తి) ఇటీవలే కన్నుమూశారు. ఆయనకి నివాళిగా 18 అడుగుల విగ్రహాన్ని రూపొందిస్తున్నారు.