భూమి కంపించగానే మొదట మనం చేసేది ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయడం. భూకంప తీవ్రతకు భవనాలు కూలిపోయే ప్రమాదం ఉన్నందున ప్రాణాలు కాపాడుకునేందుకు ఎవరైనా చేసేది ఇదే. భూకంపాలు తట్టుకునేలా నిర్మాణాలు ఉంటే చాలా వరకు ఆస్తి, ప్రాణనష్టం తప్పుతుంది. భూకంపలేఖినిపై తీవ్రత 6 వరకు ఉన్నా భయపడాల్సిన పనిలేదని.. బయటకు పరుగులు తీయాల్సిన అవసరం కూడా ఉండదని శాస్త్రవేత్తలు అంటున్నారు. కొత్తగా కడుతున్న భారీ ప్రాజెక్ట్‌లను భూకంపాలను తట్టుకునేలా డిజైన్ చేస్తున్నారు.
భాగ్యనగరంలో ఉన్న పాత ప్రాజెక్ట్‌లు, ఇళ్లమాటేమిటి? తాజాగా బోరబండలో భూప్రకంపనలతో భవనాల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. నగరంలో భవనాల భూకంప భద్రతపై ర్యాపిడ్ విజువల్ స్క్రీనింగ్ (ఆర్‌వీఎస్) చేయించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు, స్ట్రక్చరల్ ఇంజినీర్లు అంటున్నారు. ఆర్‌వీఎస్‌లో భవనాల నిర్మాణాన్ని బట్టి భూకంప తీవ్రతను ఏ మేరకు తట్టుకుంటాయి? అనేది తేలనుంది. జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ) ఈ అధ్యయనం చేసేందుకు సన్నద్ధంగా ఉంది. నగరంలో సమగ్ర అధ్యయనం చేసి ఎన్ని భవనాలు ఎంత తీవ్రత భూకంపాలను తట్టుకుంటాయి? మరమ్మతులు ఏ మేరకు అవసరం వంటివి సూచించనుంది.